AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. పసిబిడ్డను బలితీసుకున్న పందికొక్కులు! కన్నీళ్లు పెట్టించే ఘటన

పేదరికంలో ఉన్న దుర్గమ్మ, గురవయ్య దంపతులు పోలియోతో బాధపడుతున్న శిశువును దత్తత తీసుకున్నారు. కానీ, కొద్ది రోజులకే పందికొక్కుల దాడిలో ఆ శిశువు మరణించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై పందికొక్కులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

అయ్యో పాపం.. పసిబిడ్డను బలితీసుకున్న పందికొక్కులు! కన్నీళ్లు పెట్టించే ఘటన
Baby
SN Pasha
|

Updated on: Mar 05, 2025 | 9:39 PM

Share

ఆ దంపతులు వారు ఎంత పేదరికంలో ఉన్నా.. పిల్లలపై వారికున్న ప్రేమ ఓ చిన్నారిని దత్తత తీసుకునేలా చేసింది. పైగా వాళ్లు దత్తత తీసుకుంది ఓ పోలియో సోకిన శిశువును. వారి ఔదర్యానికి దిష్టి తగిలినట్టు ఉందేమో కానీ, ఆ పసిబిడ్డపై పందికొక్కులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆశపడిన ఆ దంపతులకు కంటిమీద కనుకులేని లేకుండా చేసే సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుర్గమ్మ, గురవయ్యలు గాజులు, బెలూన్స్ అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు.

సంచార జీవనం గడిపే వీరు పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వారంలో ప్లాస్టిక్ పట్టాతో ఇల్లు వేసుకొని కొద్దీ రోజులుగా ఉంటున్నారు. వీరికి పిల్లలు లేకపోవడంతో మూడు నెలల క్రితం పోలియో సోకిన ఒక మగ శిశువును దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి ఆ శిశువును పెంచుకుంటూ వస్తున్నారు. అయితే బుధవారం ఉదయం గురవయ్య బెలూన్స్ అమ్మేందుకు ఊళ్లోకి వెళ్లాడు. ఆ సమయంలోనే దుర్గమ్మ నాలుగు నెలల శిశువును ఇంట్లో నెలపై పడుకోబెట్టి టిఫిన్ తెచ్చుకునేందుకు బయటకు వెళ్లింది. అయతే ఆమె తిరిగి వచ్చే సరికి బాలుడిపై పందికొక్కు ఉండటాన్ని చూసి ఉలిక్కి పడింది. వెంటనే ఆమె గట్టిగా శబ్ధం చేయడంతో రెండు పందికొక్కులు అక్కడి నుండి వెళ్లిపోయాయి.

దీంతో కంగారు పడిన దుర్గమ్మ బిడ్డను తీసుకుంది. అప్పటికే బిడ్డ ముఖంపై తీవ్ర గాయాలున్నాయి. పందికొక్కులు కొరకడంతో రక్తస్రావం అవుతోంది. కంగారు పడిన దుర్గమ్మ బిడ్డను తీసుకొని ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే బిడ్డలో చలనం లేకపోవడంతో అనుమానం వచ్చి చుట్టు పక్కల వారికి చూపించింది. వారు బిడ్డ చనిపోయినట్లు చెప్పారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషాద ఘటన గ్రామంలో అందరిని కన్నీళ్లు పెట్టించింది. విషయం తెలుసుకున్న గురవయ్య ఇంటి వద్దకు వచ్చి, విగతజీవిగా మారిన ఆ చిన్నారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. సంతానం లేకపోవడంతో దత్తత తీసుకొని పెంచుకుంటున్న శిశువు నాలుగు నెలలకే చనిపోవడం అందరిని కలిచివేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.