Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లాలో రంగుల సంబరానికి సంసిద్ధం.. నేటి నుంచి 20 రోజుల వరకు ఉత్సవాలు
పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి రంగుల మహోత్సవం వచ్చిందంటే మక్కపేట, చిల్లకల్లు, జగ్గయ్యపేట, భీమవరం, లింగగూడెం గ్రామ ప్రజలకు, వారి బంధువుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇక్కడ ఇంతకన్నా పెద్ద పండుగ మరొకటి లేదు. పురాతన కాలంలో చెక్కతో చేసిన విగ్రహాలు కావటంతో విగ్రహాలకు చిన్నచిన్న మరమ్మతులు అవసరమవుతాయి. దీంతో ప్రతి రెండేళ్లకు ఆలయంలోని 11 విగ్రహాలను జగ్గయ్యపేటలో రంగులు వేస్తారు..

పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 1: పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి రంగుల మహోత్సవం వచ్చిందంటే మక్కపేట, చిల్లకల్లు, జగ్గయ్యపేట, భీమవరం, లింగగూడెం గ్రామ ప్రజలకు, వారి బంధువుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇక్కడ ఇంతకన్నా పెద్ద పండుగ మరొకటి లేదు. పురాతన కాలంలో చెక్కతో చేసిన విగ్రహాలు కావటంతో విగ్రహాలకు చిన్నచిన్న మరమ్మతులు అవసరమవుతాయి. దీంతో ప్రతి రెండేళ్లకు ఆలయంలోని 11 విగ్రహాలను జగ్గయ్యపేటలో రంగులు వేస్తారు. ఈ పనులు పూర్వ కాలం నుంచీ నకాసి వంశీయులు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటిన రంగులకు బయలు దేరే విగ్రహాలు ఫిబ్రవరి 2 తెల్లవారు జామున జగ్గయ్యపేటకు చేరుతాయి. రంగుల అనంతరం ఫిబ్రవరి 18న తెల్లవారు జామున జగ్గయ్యపేటలో బయలు దేరతాయి. జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు, రాత్రికి వత్సవాయి మండలం భీమవరానికి విగ్రహాలు చేరుతాయి. అనంతరం ఫిబ్రవరి 19న భీమవరం నుంచి పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి చేరుకుంటాయి. సాయంత్రం పెనుగంచిప్రోలు రంగుల మండపం వద్దకు చేరుకుని, రాత్రికి రథంలో ఊరేగింపుగా ఫిబ్రవరి 20న తెల్లవారు జామున పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల విశేషాలు ఓ సారి చూడండి..
గోపయ్య సమేత తిరుపతమ్మ వారితో పాటు సహదేవతల విగ్రహాలను తిరుగు ప్రయాణంలో రజకులు జగ్గయ్యపేట నుంచి పల్లకీల్లో చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచిప్రోలుకు చేరుస్తారు. పల్లకీలు పెనుగంచిప్రోలు–5, అనిగండ్లపాడు, సుబ్బాయిగూడెం, ముండ్లపాడు గ్రామాలకు చెందిన ఒక్కో పల్లకీ ఉంటుంది. గ్రామాల్లో పల్లకీలకు భక్తులు ఎదురేగి స్వాగతం పలుకుతారు. మొక్కులు తీర్చుకొని కుటుంబసభ్యులు, బంధుగణంతో సరదాగా గడుపుతారు.
ఆలయం నుంచి విగ్రహాలను బయటకు తీసిన తర్వాత రజకులు వాటిని నెత్తిన పెట్టుకొని మోసుకుంటూ గ్రామం చివరన ఉన్న రంగుల మండపం వరకు చేరుస్తారు. అక్కడ నుంచి విగ్రహాలను గ్రామానికి చెందిన రైతులు అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై.. ఒక్కొక్క బండిపై ఒక్కో విగ్రహాన్ని ఉంచి జగ్గయ్యపేటలో రంగులు వేసే మండపం వద్దకు మక్కపేట, చిల్లకల్లు మీదుగా భక్తజన సందోహం మధ్య తీసుకెళ్తారు.. ఫిబ్రవరి ఒకటో తేదీన పెనుగంచిప్రోలు నుంచి తిరుపతమ్మ పయనమయ్య జగ్గయ్యపేట మండపం వద్ద రంగులు ఫిబ్రవరి 20న తిరిగి రానున్నాయి. రంగుల ఉత్సవానికి విగ్రహాలు వెళ్లేటప్పుడు శక్తి వేషాలు, పలు రకాల వాయిద్యాలు, కోలాట నృత్యాలు ఏర్పాటు చేస్తారు. గ్రామస్తులు అందరూ ఉత్సవాలకు సహకరించాలి. అధికారులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




