Pawan Kalyan: రాజోలులో నిలిచిన విద్యుత్.. సెల్‌ఫోన్‌లతో పవన్‌కు ఫ్యాన్స్ స్వాగతం.. నేడు మల్కిపురంలో బహిరంగ సభ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్‌కళ్యాణ్ వారాహీ యాత్ర కొనసాగుతోంది. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ పవన్‌కు ఘనస్వాగతం పలుకుతున్నారు. అయితే.. రాజోలు నియోజకవర్గం చేరుకున్న సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో సెల్‌ఫోన్ల వెలుగులో యాత్ర చేశారు పవన్‌కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ లోని గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. వారాహి యాత్రలో భాగంగా రాజోలుకు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు హారతులతో స్వాగతం పలికారు కార్యకర్తలు, అభిమానులు. ఇక.. శుక్రవారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, జగ్గన్నపేట మీదుగా యాత్ర కొనసాగించారు పవన్‌కళ్యాణ్. రాత్రి మలికిపురం మండలం దిండి రిసార్ట్స్‌లో బస చేసిన పవన్‌కళ్యాణ్.. ఇవాళ బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
రాజోలు పవన్ ర్యాలీలో విద్యుత్ నిలిచిపోవడంతో.. అంధకారంలోనూ సెల్‌ఫోన్‌లతో పవన్‌కు స్వాగతం పలికారు అభిమానులు. అంతకుముందు.. అమలాపురంలో కార్యకర్తలు, నాయకుల సమావేశంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. అమాయక యువతపై పెట్టిన కోనసీమ అల్లర్ల కేసులు వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ వాసులు ఎంతగా అభిమానం చూపుతారో.. వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుందన్నారు పవన్‌కళ్యాణ్. పోరాటాలు ఎప్పుడు అహింసాయుత మార్గాల్లో జరగాలని.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని యువతతోపాటు ప్రజలకు సూచించారు.
ప్రజల కోసం నేను ముఠా కూలీ, ముఠా మేస్త్రిలా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు పవన్‌కళ్యాణ్. ఎంతటి వస్తాదులైనా.. తోపులైనా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగిస్తే ప్రజల కోసం పోరాడంలో వెనక్కి తగ్గేదేలేదని చెప్పారు. అన్ని కులాలు కొట్టుకోకుండా ఐక్యతతో ముందుకు వెళ్లడమే జనసేన లక్ష్యమన్నారు. నేను పొలిటికల్ ప్రాసెస్ మొదలుపెట్టి 14 ఏళ్లు అవుతుందని.. అరణ్యవాసం ముగించుకుని ఇప్పుడే మనం బయటికి వచ్చామన్నారు పవన్‌కళ్యాన్. మొత్తంగా.. పవన్ టూర్‌తో కోనసీమ కాపు రాజకీయాల్లో కాక రేపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..