TDP Vs Jagan: సీఎం జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ఛార్జిషీట్ విడుదల.. ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్
సీఎం జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. నాలుగేళ్ల జగన్ పాలనలో.. నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలనే పేరుతో ఛార్జిషీట్ రిలీజ్ చేశారు టీడీపీ ముఖ్య నేతలు.
వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసనలకు దిగింది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని, ప్రజలను ఏ విధంగా మోసం చేశారో తెలియజేస్తూ పలు అంశాలను వివరిస్తూ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు టీడీపీ నేతలు. నాలుగేళ్ల క్రితం ప్రజా వేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుత్వం పరిపాలన మొదలైందన్నారు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎక్కడ చూసిన విధ్వంసమే.. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కూలాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి బూటక సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. గతంలోని పథకాలకే మసిపూసి పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. వైసీపీ నాలుగేళ్ల పాలనలో అన్నీ నేరాలే, ఘోరాలే అని దుయ్యబట్టారు. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏం మేలు చేశారో.. చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేనటువంటి ఆస్తులు ఏపీ సీఎం జగన్‌కు ఉన్నాయన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ. అత్యంత ధనిక సీఎంగా జగన్ రెడ్డి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి అత్యంత ధనికుడుగా ఎదిగితే.. పేదవాళ్లు అత్యంత పేదవాళ్ల స్థాయికి చేరుకున్నారన్నారు. ఇక.. అప్పట్లో ప్రజావేదిక కూల్చివేతకు ఆదేశాలిస్తూ.. జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..