Konaseema: వరదలు వచ్చే సమయం వస్తోంది.. గోదారి గట్టు ఎత్తు పెంచాలని పల్లెపాలెం గ్రామస్తులు, జనసేన నాయకుల ఆందోళన
గోదారి పొంగితే తమ ఊరు సెలయేరుగా మారుతుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏరు పొంగకుండా గట్టు ఎత్తు పెంచి, దాన్ని పటిష్టం చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏలినవారు కనికరించడం లేదని భోరుమంటున్నారు గ్రామస్తులు.
వానొస్తే వరదొస్తుంది. వరద వస్తే ఊరు ఏరుగా మారుతుంది. మాకు కన్నీళ్లు మిగలుస్తుంది. అందుకే చినుకు పడితే మాకు వణుకు వస్తోంది. మా ఊరి ఏటి గట్లు పటిష్టం చేయండి బాబూ అంటూ వేడుకుంటున్నారు గ్రామస్తులు. ఈ కన్నీటి బాధలు తప్పించాలంటూ కోనసీమ జిల్లా పల్లె పాలెం జనం ఆందోళన బాట పట్టారు.
అంబేద్కర్-కోనసీమ జిల్లా, రాజోలు మండలం నున్నవారి బాడవ పల్లె పాలెం. ఊరి పక్కనే ఏరుంది. గోదారి పొంగితే తమ ఊరు సెలయేరుగా మారుతుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏరు పొంగకుండా గట్టు ఎత్తు పెంచి, దాన్ని పటిష్టం చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏలినవారు కనికరించడం లేదని భోరుమంటున్నారు గ్రామస్తులు. ఆవేదన ఆగ్రహంగా మారడంతో ఇలా ఆందోళన బాట పట్టారు పల్లె జనం. ఏటి గట్లు పటిష్టం చెయ్యాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. పల్లెపాలెం గ్రామస్తులు, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు.
గోదావరికి వరదలు వచ్చిన సమయంలో 15 రోజుల్లో ఏటి గట్లు పటిష్టం చేయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అయినా అది అమలు కాలేదంటున్నారు గ్రామస్తులు. గత ఏడాది ఆగష్టులో వచ్చిన ఉధృతమైన వరదలకు వారం రోజులు నిద్ర లేని రాత్రులు గడిపామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పటికప్పుడు హడావుడిగా వేసిన ఇసుక బస్తాలు తప్ప ఇప్పటివరకు ఏటిగట్టు పటిష్టతకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేంటున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు స్పందింంచి తక్షణమే ఏటిగట్టు ఎత్తు పెంచాలని జనం కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..