TDP: కంచుకోట కొట్టేలా.. ఆ జిల్లాలో సై అంటున్న టీడీపీ కొత్త నాయకత్వం..
ఉమ్మడి విజయనగరం జిల్లా.. ఒకప్పుడు సైకిల్ పార్టీకి కంచుకోట. 2014లో సాలూరు, కురుపాం, బొబ్బిలి మినహా మిగిలిన సీట్లన్నీ టీడీపీనే గెలుచుకుంది. 2019లో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా గెలుచుకుని జిల్లాని బలమైన కోటగా మలుచుకుంది వైసీపీ. గత ఎన్నికల్లో దారుణ పరాజయంతో..
ఆ జిల్లాలో పలువురు ప్రతిపక్ష పార్టీ ఇంచార్జ్‌లు టెన్షన్‌లో ఉన్నారు. నిన్న మొన్నటిదాకా ధీమాగానే ఉన్న ఆ నేతలకు ఇప్పుడెందుకో డౌట్ కొడ్తోంది. మారుతున్న సమీకరణాలు, సర్వేలతో ఎవరికి సీటు దక్కుతుందో, ఎవరి కథ అడ్డం తిరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారు అక్కడి తమ్ముళ్లు. పెరుగుతున్న ఆశావహుల సంఖ్య వారిని మరింత కలవరపెడుతోంది. ఇంతకీ కంగారు పడుతున్న ఆ ఇంచార్జిలు ఎవరు? ఏ జిల్లావారు?
ఉమ్మడి విజయనగరం జిల్లా.. ఒకప్పుడు సైకిల్ పార్టీకి కంచుకోట. 2014లో సాలూరు, కురుపాం, బొబ్బిలి మినహా మిగిలిన సీట్లన్నీ టీడీపీనే గెలుచుకుంది. 2019లో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా గెలుచుకుని జిల్లాని బలమైన కోటగా మలుచుకుంది వైసీపీ. గత ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఈసారి టీడీపీ విజయనగరం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలవాలన్న టార్గెట్‌తో ఉంది విపక్షపార్టీ. నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించుకుని కొన్ని చోట్ల మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. సమీక్షలు, సర్వేల తర్వాత కొన్నిచోట్ల కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది టీడీపీ అధినాయకత్వం.
విజయనగరం జిల్లాలో ఈసారి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనుకుంటోందట టీడీపీ హైకమాండ్. పార్వతీపురం నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్లున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మరొకరు ద్వారపురెడ్డి జగదీష్. ప్రతీ విషయంలో నేతలిద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టు ఒకరిపై మరొకరు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసుకునేవారట. ఇద్దరూ పంతాలకు పోయి పార్టీని ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చిన టీడీపీ పెద్దలు చివరికి మూడో నాయకుడ్ని తెరపైకితెచ్చారు. సీనియర్లు ఇద్దరిలో ఎవరివైపు మొగ్గినా ఇబ్బందులు తప్పవనుకుని కొత్త మొహాన్ని తెరపైకి తెచ్చింది అధినాయకత్వం. బోనెల విజయచంద్ర అనే యువకుడిని రాత్రికి రాత్రే ఇంచార్జిగా ప్రకటించటంతో పార్వతీపురం సీనియర్లు షాక్ తిన్నారు.
గజపతినగరం నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఇక్కడున్న ఇద్దరు నాయకులు మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అన్నట్లుంటున్నారు. తమ మాటే నెగ్గాలన్న పంతంతో పార్టీ కేడర్‌ని గందరగోళంలో పడేస్తున్నారని పార్టీ పెద్దలకు నివేదికలు అందాయట. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, పార్టీ రాష్ట్ర నాయకుడు కరణం శివరాంకృష్ణ ఇద్దరి మధ్యా పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అధినాయకత్వానికి అర్ధమైంది. ఇప్పటికైనా సీనియర్ల మధ్య సఖ్యత కుదరకపోతే ఆ ఇద్దరినీ పక్కనపెట్టి కొత్త మొహాన్ని తెరపైకి తేవడమే సమస్యకు పరిష్కారమన్న ఆలోచనతో ఉందట టీడీపీ అధిష్ఠానం. అక్కడ పిట్టపోరు పిట్టపోరు చివరికి పిల్లి తీర్చేలా ఉందంటున్నారు.
విజయనగరం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం ఎస్ కోట టీడీపీలో కూడా కొత్త నాయకుడు తెరపైకొచ్చారు. ఎన్నారై గొంప కృష్ణని టీడీపీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోళ్ల లలితకుమారి ఎస్ కోట ఇంచార్జిగా ఉన్నారు. అయినా ఛాన్స్ ప్లీజ్ అంటున్న గొంప కృష్ణ.. ఎస్ కోట సీటిస్తే గెలిచి చూపిస్తానంటున్నారట. ఎన్నారై లీడర్ స్పీడ్ పెంచటంతో ఎస్‌కోటలో నేతల మధ్య ఆధిపత్య పోరు అప్పుడప్పుడూ వాదులాటలు, తోపులాటలదాకా వెళ్తోంది. లలితకుమారి పార్టీకి లాయల్‌గా ఉన్నా.. గొంప కృష్ణ స్పీడ్ చూస్తుంటే సీటు ఎవరికొస్తుందో తెలీని అయోమయంలో ఉన్నారు ఎస్ కోట తమ్ముళ్లు.
సీనియర్లం..మనకు తిరుగేలేదన్న పరిస్థితి మెజారిటీ నియోజకవర్గాల్లో లేదు. సీనియర్ల మధ్య సఖ్యత లేని నియోజకవర్గాల్లో బుజ్జగింపులు బతిమాలుకోడాలు లేవన్నట్లు నిర్మొహమాటంగా కొత్త నేతలని తెస్తోంది టీడీపీ నాయకత్వం. దీంతో కొన్ని నియోజకవర్గాల ఇంచార్జిల్లో ఎన్నికలనాటికి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. సగానికి సగం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఏ ఇంచార్జిని ఎప్పుడు మారుస్తారో తెలీడంలేదంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. పార్టీ కూడా టికెట్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వెయిట్ అండ్ సీ అన్నట్లు కాలం గడిపేస్తోంది. ఈ ధోరణితో అసలుకే ఎసరొస్తుందేమోనన్న భయం కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది.