Vijayawad: విజయవాడ దుర్గగుడికి ఏటా ఎంత ఆదాయం వస్తుందో తెల్సా..?
ఏపీలో రెండో అతిపెద్ద ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్న చారిత్రక పుణ్య క్షేత్రమది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యాల కల్పనలో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా మరో ఘాట్ రోడ్ నిర్మాణానికి నడుం బిగించింది. కనకదుర్గ ఆలయ అభివృద్ధిపై టీవీ9 స్పెషల్ ఫోకస్..

విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని ఏటా రెండు కోట్ల మందికిపైగా భక్తులు సందర్శిస్తున్నారు. గత ప్రభుత్వ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు మరిన్ని అంశాలను జోడించిన కూటమి ప్రభుత్వం ఆలయ అభివృద్ధి ప్రక్రియలో వేగం పెంచింది. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, అన్నదాన భవనం, ప్రసాదాల పోటు భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన ఈ పనులు దసరా నాటికి పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆలయానికి ఏటా రూ. 120 కోట్ల ఆదాయం
ఏటా 120 కోట్ల ఆదాయం వస్తూన్నప్పటికీ.. భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టలేకపోతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలను పెంచుతోంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్తగా మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మార్గం ఏర్పడితే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది.
ఒకప్పుడు కాలిబాటగా ఉన్న ప్రస్తుత ఘాట్ రోడ్
ప్రస్తుతమున్న ఘాట్ రోడ్ ఒకప్పుడు కాలిబాటగా ఉండేది. 1969లో దీన్ని ఘాట్ రోడ్డుగా మార్చారు. చాలా మంది భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మెట్ల మార్గాన్ని ఇష్టపడుతుంటారు. నిత్యం వేలమంది భక్తులు వాహనాల్లో వస్తూండటంతో ట్రాఫిక్ రద్దీ పెరిపోయింది.
కొత్త ఘాట్ రోడ్‌తో ట్రాఫిక్ సమస్యలకు చెక్
డాక్టర్ కేఎల్ రావు హెడ్ వాటర్ వర్స్ ఎదురుగా ఉన్న కొండపై నుంచి దుర్గమ్మ సన్నిధికి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ రోడ్ అందుబాటులోకి వస్తే టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు నుంచి వచ్చే యాత్రికులు ఈ రోడ్డు ద్వారా నేరుగా కొండపైకి చేరుకొనే అవకాశమేర్పడుతుంది. టోల్ గేట్ దగ్గర రద్దీ సైతం తగ్గిపోతుంది.
గత పుష్కరాల సమయంలో ఘాట్ రోడ్‌కు ప్రతిపాదనలు
ఘాట్ రోడ్డు వైపు రెండో రహదారి నిర్మాణంకోసం గత పుష్కరాల సమయంలో ప్రతిపాదనలు సిద్దం చేసిన అధికారులు కొంతమేర రహదారిని సైతం నిర్మించారు. కొండ మధ్యలో గుహ మార్గం ఉండడంతో పురావస్తు శాఖ అభ్యంతరం తెలియజేసినట్లు తెలిసింది. దీనికితోడు ఆలయ వైదిక కమిటీ కూడా ఈ మార్గంలో రోడ్డు నిర్మాణం మంచిది కాదని సూచించడంతో రోడ్డు నిర్మాణం ఆగిపోయింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గగుడి సర్వతోముఖాభివృద్ధి చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కృత నిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా రెండో ఘాట్ రోడ్డు నిర్మించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. పురావస్తుశాఖ అధికారుల అనుమతికోసం కూడా ప్రయత్నిస్తున్నారు. వాస్తు మార్పులు, చేర్పులతో రోడ్డు నిర్మించవచ్చని పండితులు కూడా చెబుతుండటంతో ఘాట్ రోడ్ నిర్మాణంకు మార్గం సుగమమైట్లే కన్పిస్తోంది.
మాస్టర్ ప్లాన్‌కు కొత్త రూపు
మరోవైపు ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం విడుదల చేసిన మాస్టర్ ప్లాన్‌కు మార్పులు, చేర్పులు చేస్తూ ప్లాన్‌కు కొత్తరూపు ఇస్తున్నారు. ఈ ప్లాన్‌లో మూడో ఘాట్ రోడ్ అంశం కూడా పొందుపర్చినట్లు తెలుస్తోంది. దుర్గగుడితో పాటు పర్యాటక శాఖను సమన్వయం చేయనున్నారు. అదేవిధంగా కేంద్రం అమలుచేస్తున్న ప్రసాద్ పథకం ద్వారా నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులు ఊపందుకున్నట్లే కన్పిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా రెండో ఘాట్ రోడ్, కాటేజీలు, ప్రసాదాల పోటు, అన్నప్రసాద కేంద్రం, కేశఖండన శాల, శాశ్వత ప్రాతిపదికన ఉండేపోయేలా నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయని భక్తులు ఆశిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..