10th Class Result Date: టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే?
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. పదో తరగతి జవాబు పత్రాల ముల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయిస్తున్నారు..

అమరావతి, ఏప్రిల్ 5: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. పదో తరగతి జవాబు పత్రాల ముల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవగా.. ఏప్రిల్ 9 నాటికి పూర్తి చేసేలా కార్యచరన రూపొందించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 3,100 మంది ఉపాధ్యాయులకు ఆ విధులు కేటాయించారు. వీరు మొత్తం 3.20 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయనున్నారు. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాకు చెందిన 1.80 లక్షల పేపర్లు ఉన్నాయి. వీటి మూల్యాంకనానికి 1268 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఈసారి చాలా ముందుగానే ఫలితాలను వెల్లడించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం ఈ మేరకు రికార్డుస్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు ఉపాధ్యాయులను కేటాయించింది.
అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ నెలాఖరులోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఎక్కువ మంది ఉపాధ్యాయులతో సకాలంలో మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా సమాధాన పత్రాలను స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. మూల్యాంకనం అక్కడే జరిగేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 9 వరకు మూల్యాంకనం ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించనున్నారు. ప్రతీ ఉపాధ్యాయుడికి ఒక్కోరోజు తొలుత 40 పేపర్ల చొప్పున మూల్యాంకనానికి ఇస్తారు. నిర్దేశిత వ్యవధిలోగా దిద్దితే మరో 10 పేపర్లు కూడా వారికి ఇస్తారు.
మరోవైపు పల్నాడు జిల్లాలో మూల్యాంకనం కోసం ప్రధానోపాధ్యాయులతోపాటు కొన్ని పాఠశాలల్లోని మొత్తం ఉపాధ్యాయులను పంపుతుండడంతో అక్కడ 3 నుంచి 9 తరగతుల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. క్లాసులు ఎవరు నిర్వహించాలో తెలియక అవస్థలుపడుతున్నారు. ఇక ఏపీ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్యలో పది, ఇంటరు పరీక్షలు రాసిన 16,500 మంది పేపర్లను ఉమ్మడి గుంటూరులో మూల్యాంకనం చేయనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.