Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర డేట్ కన్ఫార్మ్.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు.. ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. వంటి మహామహానాయకులు పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. వారి సరసన చేరేందుకు సిద్ధమయ్యారు టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2023 జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ప్రారంభమయ్యే లోకేశ్ పాదయాత్ర సక్సెస్ కోసం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. లోకేశ్ పాదయాత్రకు పేరు, ముహర్తం ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పాదయాత్రపై ఇవాళ (బుధవారం) పార్టీ ముఖ్య నేతలు ప్రెస్ మీట్ పెట్టి.. పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
మొత్తం 400 రోజులు 4వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించనున్నారు నారా లోకేశ్. కుప్పం నుంచి మొదలయ్యే పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు జరగనుంది. మొదట్లో బస్సుయాత్ర చేపట్టాలనుకున్నా.. ప్రజల్లోకి వెళ్లాలంటే పాదయాత్ర మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. లోకేశ్ పాదయాత్రపై మంత్రి రోజా గతంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రి సీఎంగా ఉండగానే మంగళగిరిలో గెలవలేకపోయిన లోకేశ్.. జగన్ కు సవాళ్లు విసరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
పాదయాత్ర సమయంలో ప్రజలతో మమేకమవుతూనే పార్టీని బలోపేతం చేయాలని లోకేశ్ భావిస్తున్నారు. ఈ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేయాలని భావిస్తోంది టీడీపీ. లోకేశ్ పాదయాత్ర మాత్రమే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు చంద్రబాబునాయుడు. ఈ సమావేశాలు నిర్వహిస్తూనే రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. చూడాలి మరి.. లోకేశ్ పాదయాత్ర ఏపీలో ఎలాంటి ప్రభావం చూపుతుందో.




మరిన్ని ఏపీ న్యూస్ కోసం