Nandamuri Kalyan Ram: అందరూ హుందాగా నడుచుకోవాలి.. అసెంబ్లీ ఘటనపై నందమూరి కళ్యాణ్ రామ్ ఫైర్..
Nandamuri Kalyan Ram: ఏపీ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు దుర్భషలాడుకుంటూ.. రాజకీయాల్లోకి కుటుంబసభ్యుల పేర్లు

Nandamuri Kalyan Ram: ఏపీ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు దుర్భషలాడుకుంటూ.. రాజకీయాల్లోకి కుటుంబసభ్యుల పేర్లు తీసుకురాడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన భార్య గురించి అధికార వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు నిన్న జరిగిన మీడియా సమావేశంలో విలపించిన సంగతి తెలిసిందే. తన రాజకీయ జీవితంలో తన కుటుంబసభ్యుల గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వినలేదని.. ఇకపై అసెంబ్లీకి రానంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశం అనంతరం ఏపీలో రాజకీయ రగడ రాజుకుంది. ఈ క్రమంలో బావ కన్నీరు పెట్టడం, తన అక్క గురించి తప్పుగా మాట్లాడటంపై నందమూరి బాలకృష్ణ సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకూ సహించాం భరించాం.. ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు. ఇక ఇంకోసారి.. ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదంటూ బాలాకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఆడవారి గురించి ఎవరైనా మాట్లాడినా.. హద్దు మీరి ప్రవర్తించినా.. నోటికొచ్చినట్లు వాగినా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై నటుడు తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలామంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను అంటూ ట్విట్ చేశారు. ”యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.. యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:” అంటూ ట్విట్ చేశారు.
పూజ్యులు నందమూరీ ఎన్టీ రామారావు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం అంటూ కళ్యాణ్ రామ్ ట్విట్‌లో పేర్కొ్న్నారు. కాగా నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి కుటుంబసభ్యులంతా ఖండించారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా స్పందించలేదు. ఆయన దీనిపై మాట్లాడాలంటూ తెలుగు తమ్ముళ్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.