AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ ఊరి హైస్కూల్‌లో ఏడాదంతా ఒంటిపూటే తరగతులు.. ఒంటి గంటైతే ఫైనల్‌ బెల్‌! ఎందుకంటే

ఆ ఊరి హైస్కూల్ రూటే సపరేటు. రోజూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే క్లాసులు జరుగుతాయి. ఆ తర్వాత పిల్లలంతా ఇళ్లకు వెళ్లిపోతారు. వేసవిలో వచ్చే ఒంటి పూట బడులు.. అక్కడ మాత్రం సుమారు 40 ఏళ్లుగా ఇదే రీతిలో ఒకపూటే తరగతులు జరుగుతున్నాయి..

Andhra Pradesh: ఆ ఊరి హైస్కూల్‌లో ఏడాదంతా ఒంటిపూటే తరగతులు.. ఒంటి గంటైతే ఫైనల్‌ బెల్‌! ఎందుకంటే
Half Day School
Srilakshmi C
|

Updated on: Nov 25, 2024 | 8:25 AM

Share

నందలూరు, నవంబర్‌ 25: సాధారణంగా అన్ని ప్రభుత్వ బడుల్లో సాయంత్రం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి. 4 తర్వాత పిల్లలు ఇళ్లకు చేరుకుంటారు. వేసవిలో అయితే ఒంటిగంట వరకు తరగతులు జరుగుతాయి. అయితే ఈ ఊరిలో మాత్రం కాలం ఏదైనాసరే మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు బడి బంద్‌ అవుతుంది. ఆ హైస్కూల్‌లో తీరే వేరు. ఇక్కడ ఒంటి గంటకే ఫైనల్‌ బెల్‌ కొట్టేస్తారు. అన్నమయ్య జిల్లా నందలూరులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ గురించే మనం చెప్పుకుంటుంది. ఒంటిపూట నడిచే ఏకైక హైస్కూల్‌గా ఇది రికార్డులకెక్కింది. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్‌ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌గా.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్‌ సెకండరీ హైస్కూల్‌గా రూపాంతరం చెందింది.

అలాగే కాలక్రమేణా ఈ హైస్కూల్‌ రూపు రేఖలు కూడా మారుతూ వచ్చాయి. ఒకప్పుడు విశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్, గ్రౌండ్‌ ఉండేది. అలాగే నాణ్యమైన బోధనకు మారుపేరుగా ఉండేది. ఇక్కడ చదువుకున్న ఎందరో ఐఏఎస్‌లుగా ఎదిగారు. అంతటి ఘన చరిత్ర ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ హైస్కూల్‌లో ఉదయం 7.45 గంటలకు తరగతులు ప్రారంభమైతే మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నారు. నందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్‌ ఉంటుంది. 1982 నుంచి ఈ హైస్కూల్‌ వన్నె తగ్గుతూ వచ్చింది. నందలూరులోని జూనియర్‌ కళాశాలను ఇక్కడికి మార్చారు. సొంతభవనాల నిర్మాణం వరకు ఈ హైస్కూల్‌ను వాడుకుంటామని చెప్పిన ఇంటర్‌ బోర్డు ఇప్పటి వరకు ఇక్కడే తిష్టవేయించింది. ఇక్కడి నుంచి జూనియర్‌ కాలేజీని తరలించాలని జెడ్పీ హైస్కూల్‌ యాజమాన్యం ఎన్నిసార్లు విన్నవించినా కలెక్టర్ల నుంచి స్పందన కరువైంది. మొత్తం 274 మంది విద్యార్థులు ఈ హైస్కూల్‌లో చదువుతుండగా.. వారందరికీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్‌ విద్యార్ధులకు ఇక్కడ తరగతులు జరుగుతాయి.

దీంతో హై స్కూల్‌ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒంటి పూట తరగతుల వల్ల పూర్తి స్థాయిలో వారికి విద్యాబోధన అందడం లేదు. ఇదిలా ఉంటే జూనియర్ కళాశాల తరలింపును కొందరు జూనియర్‌ లెక్చరర్లు సైతం వ్యతిరేకించడం గమనార్హం. మండల కాంప్లెక్స్‌కు కాలేజీని తరలిస్తే అక్కడికి ఎస్సీ హాస్టల్‌ భవనాలు దూరంగా ఉంటాయని, అక్కడికి వెళితే ఇంటర్‌ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేస్తున్నారు. నిజానికి మండల కాంప్లెక్స్‌ విశాలంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా అక్కడే వందలాదిమంది బాలికల బీసీ గురుకుల పాఠశాల అక్కడే ఉంది. జూనియర్ లెక్చరర్ల స్వార్ధం కోసం ఈ ప్రక్రియ ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు స్పందించి హైస్కూల్‌కు ఒంటి పూట నుంచి విముక్తి కలిగించాలని స్కూల్‌ ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.