Andhra Pradesh: రంగులు కాదు.. బురద.. ఒంటినిండా పూసుకునే ఈ పండగ ఎక్కడో తెలుసా..?
అనకాపల్లి జిల్లాలోని దిమిలి గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే ప్రత్యేకమైన బురద మాంబ జాతర గురించి తెలుసుకుందాం. ఈ పండుగలో ప్రజలు ఒంటినిండా బురద పూసుకుని సంబరాలు చేసుకుంటారు. చర్మవ్యాధులు పోతాయని, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఇక్కడి వారి నమ్మకం. బురదలో కనిపించిన అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తూ, ఈ అరుదైన బురద జాతరను ఘనంగా జరుపుకుంటారు.

సాధారణంగా మన పండుగలకు సువాసనలు వెదజల్లే పన్నీరు, గంధం పూయడం చూస్తాం.. మరి కొన్ని పండుగలు రంగులు పూసుకోవడం, రంగు నీళ్లు వేయడం తెలుసు. కానీ.. బురద పూసుకునే పండుగ గురించి మీకు తెలుసా..? ఈ పండుగలో బురదను ఒంటినిండా పూసుకొని సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. ఎస్.. ప్రతి రెండేళ్లకోసారి అనకాపల్లి జిల్లా రాంబిల్లి లో ఉత్సాహంగా జరిగే బురద మాంబ జాతర గురించి తెలుసుకుందామా మరి.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం దిమిలీ గ్రామం. ఇక్కడ రెండేళ్లకోసారి వచ్చే పండుగ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాష్ట్రం దేశంలో జరిగే పండుగలకు భిన్నంగా ఇక్కడ జాతర ఉంటుంది. దిమిలిలో వెలసిన బురద మాంబ జాతరను స్థానికులు రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకను బురద జాతర అని పిలుస్తుంటారు. ఈ బురద జాతరను స్థానికులు సంబరంగా జరుపుకుంటారు. దల్లమాంబగా కొలిచే అమ్మవారిని గ్రామంలోకి స్వాగతించే క్రమంలో అనుపు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బురద జాతర చేయటం ఇక్కడి ఆనవాయితీ.
తెల్లవారుజాము నుంచే మొదలు..
ఇక.. బురద మాంబ జాతర కోసం వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు స్థానికులు. జాతర రోజున తెల్లవారుజాము నుంచి సందడి మొదలవుతుంది. ముందు రోజు రాత్రి నుంచి అందరూ వేచి చూస్తూ ఉంటారు. తెల్లవారుజామున ఊరంతా వెళ్లి డప్పుల చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి బురదను తీసుకొస్తారు. వేపాకు కొమ్మలు తీసుకొచ్చి.. ఆ కొమ్మలను బురదలో ఉంచి ఒకరిపై ఒకరు పూసుకుంటారు. ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటామని అంటారు స్థానికులు.
అలా అందుకే చేస్తారట..
ఇలా.. బురద మాంబ జాతరలో పాల్గొని వేపాకు కొమ్మలతో బురద రాసుకోవడం వలన చర్మవ్యాధులు దూరం అవుతాయని నమ్మకం. రోగాలు పోయి బురదమాంబ చల్లని ఆశీస్సులు తమపై ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. ఇలా డప్పులు కొట్టుకుంటూ గ్రామంలో తిరుగుతూ కనిపించిన వారి కల్లా బురద జల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ఈ జాతరను గ్రామ ప్రజలు జరుపుకుంటారు.
ఈ సంప్రదాయం వెనుక..
ఈ సాంప్రదాయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పూర్వం దిమిలి గ్రామంలో ఓ ఆడపిల్ల అర్ధరాత్రి దారితప్పి వచ్చిందని.. ఆమెను కొందరు ఆకాతాయిలు అడ్డగించి బలత్కారం చేయబోతే వారి నుండి తప్పించుకునేందుకు ఆ యువతి ఓ మురుగు కుంటలో బురదను ఒంటికి పూసుకుందట. అది గమనించిన గ్రామస్థులు ఆమెను రక్షించాలని ప్రయత్నించగా ఆమె భయంతో స్థానికంగా వున్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని కథగా స్థానికులు చెబుతూ ఉంటారు.
గ్రామస్తులను రక్షించేందుకే..
ఆ తర్వాత కొన్నిళ్లకు అక్కడే ఆమె దేవత విగ్రహం రూపంలో గ్రామస్తులకు కనిపించడంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్టు చెబుతున్నారు. బురదతోనే అమ్మవారిని ఊరంతా చూశారు కాబట్టి బురద మాంబగా పిలుస్తూ కొలుస్తూ పూజలు చేస్తుంటారు. అయితే తనను రక్షించాలని చూసిన వారికోసం తాను కాపాడుకోవాలని అమ్మవారు ఆ ఊరిలో దేవతగా ప్రతిష్టించబడి పూజలు అందుకుంటున్నారని చెబుతుంటారు గ్రామస్తులు.
మహిళలకు మాత్రం మినహాయింపు..
ఈ ఉత్సవంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలంట ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొంటారు కానీ మహిళలకు మినహాయింపు. జాతర ముగిసిన తర్వాత మహిళలంతా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో ఎవరైనా పాల్గొనకపోతే అరిష్టం జరుగుతుందని గ్రామస్తులు బలంగా నమ్ముతుంటారు. బుడద పండుగకు వారం రోజుల ముందు వెదుళ్ళ పండుగ కూడా ఈ గ్రామంలో విశేషంగా జరుగుతుంది.




