Ananth Sriram: ‘సిగ్గుపడుతున్నా’ కల్కీ సినిమాపై రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందని, మన పురాణాలను వక్రీకరిస్తున్నారని హైందవ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును తప్పని చెప్పాల్సిందే అంటూ.. ఆయన కల్కీ సినిమాలోని పాత్రల రూపకల్పనను తప్పు పట్టారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..
హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని.. కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు చెప్పారు. పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు మనమే తిరస్కరించాలన్నారు.
కిక్కిరిసిపోయిన హైందవ శంఖారావం సభా ప్రాంగణం
గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శంఖారావానికి ప్రజలు, వీహెచ్‌పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్ మహరాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరశర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు. ఈ సభకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనకు వీహెచ్‌పీ పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడతామన్నారు వీహెచ్‌పీ నేత గోకరాజు గంగరాజు. దేవాలయాల రక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని.. దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాల గుప్పిట్లో పెట్టకున్నాయని ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని.. హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని తెలిపారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హైందర శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామిజీలు, ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.