AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Maker Chandra Babu: ఎన్డీయేలో చంద్రబాబే ఇప్పుడు కింగ్‌ మేకర్.. ఎలా సాధించారు? ఏంటా విజయరహస్యం..!

అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతట అదే హస్తిన నుంచి అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉన్నట్టు.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే.. అయాచితంగా ఎన్డీయేలో కింగ్‌ మేకర్‌గా నిలిచారు చంద్రబాబు.

King Maker Chandra Babu: ఎన్డీయేలో చంద్రబాబే ఇప్పుడు కింగ్‌ మేకర్.. ఎలా సాధించారు? ఏంటా విజయరహస్యం..!
Chandrababu Nitish Modi
Balaraju Goud
|

Updated on: Jun 04, 2024 | 9:27 PM

Share

ఇది ఊహించని ఫలితం. అడక్కుండానే వచ్చిన అద్భుత అవకాశం. లోకల్‌గా గెలిస్తే చాలనుకుంటే.. కేంద్రంలో చక్రం తిప్పే ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కింది. సెంట్రల్‌లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందనేది అంతా ఊహించిందే. ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే.. బీజేపీకే సొంతంగా మెజారిటీ వచ్చేస్తుంది.. ఇక కూటమిలోని పార్టీలన్నీ ఉన్నా లేనట్టే అనుకున్నారంతా. కాని, అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతట అదే హస్తిన నుంచి అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉన్నట్టు.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే.. అయాచితంగా ఎన్డీయేలో కింగ్‌ మేకర్‌గా నిలిచారు చంద్రబాబు.

ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీనే. ఒకప్పుడు ఈమాట అనగానే పగలబడి నవ్వుకున్నారంతా. సోషల్‌ మీడియాలో తెగ వెక్కిరించారు. పాతిక సీట్లకు కూడా పోటీ చేయని టీడీపీ.. ఎన్డీయేలో అతిపెద్ద పార్టీగా ఉండడం ఏంటని ఒకవిధంగా ఎగతాళిగానే మాట్లాడారంతా. కాని, ఇప్పుడు నిజంగానే బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఎన్డీయేగా అవతరించింది టీడీపీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీయేలో.. ఇప్పుడు చంద్రబాబే అత్యంత కీలకం. ‘నాయుడు ది కింగ్‌మేకర్‌’ అంటూ నేషనల్‌ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. నితీష్‌ కుమార్‌ కూడా కింగ్‌ మేకర్‌లో ఒకరు. ఈ ఇద్దరే ప్రస్తుత ఎన్డీయే కూటమిని రక్షించేది. కాకపోతే.. జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ. సో, కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. పైగా టీడీపీ కూటమి గెలవగానే.. ప్రధాని మోదీ, అమిత్‌షా నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. ‘ఒకసారి కలుద్దాం’ అనే కబురు ఢిల్లీ పెద్దల నుంచే వచ్చింది. పైగా ఎన్డీయే కన్వీనర్‌గా మరోసారి చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది. అదే నిజమైతే.. ఎన్డీయేలో చక్రం తిప్పే అవకాశాన్ని బీజేపీనే చంద్రబాబు చేతిలో పెట్టినట్టు లెక్క. ఇక.. చంద్రబాబు చాణక్యం గురించి రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు. టీడీపీనే కీ-ఫ్యాక్టర్‌గా మారడంతో రేప్పొద్దున కేంద్ర క్యాబినెట్‌లోనూ కీలక పదవులు దక్కించుకోవచ్చంటున్నారు. మొత్తానికి, బీజేపీకి టీడీపీ అవసరమే ఉందనిపించేలా.. పరిస్థితులు మారడం టీడీపీ కూడా ఊహించని ఓ పరిణామం.

అయిపోయిందిక.. చంద్రబాబు పని అయిపోయింది. జగన్ ప్రభంజనం చూసి టీడీపీ తట్టాబుట్టా సర్దుకుంటుందేమో అనుకున్నారు 2019లో. ఈ దఫా గానీ టీడీపీ అధికారంలోకి రాలేదో.. ఇక ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అని కూడా మాట్లాడుకున్నారు. చంద్రబాబు వయసు దృష్ట్యా.. ఈసారి గెలవకపోతే పార్టీ పని అయిపోయినట్టేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా. కాని, చంద్రబాబు నిలబడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంత పతనాన్ని చూసినా.. గెలిచిన 23 మందిలో ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నా.. పార్టీ అధినేతగా టీడీపీని నిలబెట్టుకున్నారు. అలా ఇలా కాదు.. ఎదురుగా ఉన్నది సునామీని మించిన బలమైన పార్టీ అని తెలిసినా.. ఎదురెళ్లి పోరాడారు. ఆ పోరాట పటిమకు సునామీనే తలవంచింది. టీడీపీకి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని అందించింది.

ప్రభంజనం అంటే ఏంటో జగన్‌ చూపించారు. 2019లో 151 సీట్లు గెలిచి.. అసలు అన్ని సీట్లు గెలవడం ఎవరికైనా సాధ్యమేనా అని ముక్కున వేలేసుకునేలా చేశారు. కాని, 151 కాదు.. అంతకుమించిన ఫలితాలు సాధ్యమేనని నిరూపించారు చంద్రబాబు అండ్‌ టీమ్. నిజానికి, అసెంబ్లీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి, లోక్‌సభ ఫలితాల్లో తేలిపోతే.. చంద్రబాబును, టీడీపీని బీజేపీ అంతగా కేర్‌ చేసే వాళ్లే కాదేమో. ఏపీలో ఎవరు గెలిచినా, ఎవరికెన్ని ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో ఉన్న బీజేపీకి నెంబర్స్ మాత్రమే కావాలనేది విశ్లేషకులు చెప్పిన మాట. నిజంగా అదే జరిగి ఉంటే.. చంద్రబాబును పట్టించుకునే వారే కాదేమో. కాని, జగన్‌ కోరుకున్నట్టు ఎన్డీయేకి మెజారిటీ తగ్గింది. గత ఐదేళ్లుగా జగన్‌ కోరుకున్నది ఇదే. ‘బీజేపీకి సీట్లు తగ్గాలి, కేంద్రంలోని ప్రభుత్వానికి మన అవసరం రావాలి.. అప్పుడే మనం చెప్పినట్టు కేంద్రం వింటుంది’ అని జగన్‌ చెబుతూ వచ్చారు. సరిగ్గా అలాగే జరిగిందిప్పుడు. కాని, రాష్ట్రంలో అధికారం మారింది. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.

బీజేపీతో పొత్తా.. ఎందుకు రిస్కూ..? ఇదే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చారంతా. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆరాటపడుతుంటే.. సొంత పార్టీ వాళ్లే లోలోన ఓ మాట అనుకున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నాం.. చాలదా. పెద్దాయన ఇలా బీజేపీ వెంట పడుతున్నారేంటని అనుకున్నారు. కాని, అలా అనుకున్న వాళ్ల అంచనాలన్నీ తప్పాయిప్పుడు. బీజేపీతో పొత్తు కారణంగా మైనారిటీ ఓట్లు తగ్గిపోతాయనుకున్నారు. ఓ సెక్షన్‌ ఓటర్లు శాశ్వతంగా టీడీపీకి దూరం అవుతారునుకున్నారు. కాని, ఇక్కడే చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. మైనారిటీలకు తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి.. ఆ ఓట్లు కూడా టీడీపీ కూటమికి వచ్చేలా చేశారు. తనను మాత్రమే చూడాలంటూ హామీ ఇచ్చారు. రాయలసీమలో వైసీపీకి ఎదురుగాలి వీచిందంటే కారణం.. మైనారిటీ ఓటర్లు చంద్రబాబును నమ్మడమే అనేది విశ్లేషకులు చెబుతున్న మాట.

ఏపీలో బీజేపీకి ఓటు షేర్‌ లేనప్పుడు.. ఆ పార్టీ కోసం 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం అనవసరం అని టీడీపీ వాళ్లే అనుకున్నారు. వాళ్లకోసం తామెందుకు త్యాగం చేయాలని ప్రశ్నించారు కూడా. టికెట్లు ఇవ్వని క్షణాన.. టీడీపీకి దక్కుతుందనుకున్న సీట్లు బీజేపీకి ఇచ్చిన సమయాన.. టీడీపీలో అగ్గిరాజుకుంది. కాని, పార్టీ అధినేతగా చంద్రబాబుకు ఎప్పుడేం చేయాలో తెలుసు. ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీకి.. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు కలిపి 16 సీట్లు ఎందుకు ఇవ్వాలనుకున్నారో.. ఆనాడు చంద్రబాబుకు మాత్రమే తెలుసు. దానివెనక వ్యూహం ఏంటో అధినేతకు మాత్రమే తెలుసు. ఆ వ్యూహం ఏంటో ఇప్పుడిక చెప్పాల్సిన పని లేదు. వచ్చిన రిజల్ట్స్‌ చూస్తే.. చంద్రబాబు బీజేపీకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారో ఇక చెప్పక్కర్లేదు కూడా. ఆనాడు.. బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంటపడింది ముమ్మాటికీ నిజం. అదే టీడీపీ వెనక బీజేపీనే నడిచొస్తోందనేది కూడా నిజమే. అప్పుడు పొత్తు పెట్టుకోకపోయి ఉంటే.. ఇప్పుడిలా కింగ్‌మేకర్‌ అయ్యేవాడే కాదేమో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…