Avinash Reddy: విశ్వభారతి హాస్పిటల్ వద్ద కొనసాగుతోన్న హైడ్రామా.. రేపు హైకోర్టులో విచారణ
కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌లో వద్ద ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నారు. తల్లి లక్ష్యమ్మ అనారోగ్యం కారణంగా ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి ఆసుపత్రిలో ఉంటున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యం..
కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌లో వద్ద ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నారు. తల్లి లక్ష్యమ్మ అనారోగ్యం కారణంగా ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి ఆసుపత్రిలో ఉంటున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో వైద్యసేవలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దీంతో మే 19 నుంచి 22 వరకు సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకాలేదు. ఆయనకు సంఘీభావంగా భారీ సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ముందే బైఠాయించి నిరసనలు తెలిపారు.
ఐతే తాము ఆసుపత్రి ఎదుట బైఠాయించింది సీబీఐకి వ్యతిరేకంగా కాదని ఫ్లకార్డులతో వైసీపీ నేతలు ప్రదర్శనలు చేశారు. గత ప్రభుత్వం సీబీఐని రాష్ట్రంలో నిషేధించిందని, తమ ప్రభుత్వం సీబీఐని ఆహ్వానించిందని వైసీపీ నేతలు గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి పరిస్థితిని సీబీఐ మానవీయ కోణంలో చూడాలని నేతలు విజ్ఞప్తి చేశారు. దీంతో మంగళవారం కూడా ఆసుపత్రి వద్ద హైటెన్షన్ కొనసాగింది. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో మే 25న విచారణ జరగనుంది. అక్కడ తేలేవరకు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఎందుకీ తాత్సారం..?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ తీరును పలువురు తప్పుబడుతున్నారు. అవినాష్‌ను అరెస్టు చేయాలని ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేసిన సీబీఐ, న్యాయస్థానానికి నివేదించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ అదుపులోకి తీసుకోలేకపోయింది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం అవినాష్ పలు దఫాలుగా చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ సీబీఐని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయినప్పటికీ సీబీఐ ఎందుకో మీనమేషాలు లెక్కిస్తూనేఉంది. సామాన్యుల విషయంలో సీబీఐ ఈ తాత్సారం చేయగలుగుతుందా? అనే శేష ప్రశ్నగా మిగిలింది.