Kurnool: అమ్మో పులి.! దాని గోళ్ల వెనుక ఇంత కథ ఉందా.. తెలిస్తే మ్యాడైపోతారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో పులిగోళ్ళ మాయం అనే వార్త కలకలం రేపుతుంది. గోళ్ళ మాయం ఘటనలో తాత్కాలిక ఫారెస్ట్ ఉద్యోగి పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ జరగడం అటవీశాఖలో అలజడి మొదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దాదాపు మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన పులి గోళ్ళను కొందరు దుండగులు మాయం చేసి క్యాష్ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో విచారణ ముమ్మరం చేశారు. నంద్యాల, మహానంది, గోపవరం గ్రామాలలో విచారణ మొదలు పెట్టారు. గోళ్ళ మాయంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా.. గోళ్ళ విషయంపై విచారణ జరుగుతుందని తూచాగా చెప్పారు. ఈ ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్లందరిలో అలజడి మొదలైంది. ఈ కేసులో ఎవరెవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.
పులిగోళ్ళకు ఉన్న ప్రత్యేకత..
అనాది కాలంగా పులిగోళ్ళుకు చాలా ప్రత్యేకత ఉంది. పులి గోళ్ళను బంగారంతో అందంగా తయారు చేయించుకుని మెడలో ధరించడం ఒక స్టేటస్‌గా అందరూ భావిస్తారు. పూర్వం అడవిలో మృత్యువాత పడిన పులల గోళ్ళను చెంచులు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. పులిగోళ్ళకు మంచి డిమాండ్ ఉండటంతో పులులను వేటాడి చంపి మరీ గోళ్ళను, చర్మాన్ని అమ్ముకునేవాళ్లు. పులిగోళ్ళు ధరిస్తే ఎలాంటి దుష్టశక్తులు ఏమి చేయలేవని, నర దృష్టి తగలదని అనేది నమ్మకం. దీంతో పులిగోళ్ళు కొనుగోలు చేసి ధరించడానికి చాలామంది మక్కువ చూపిస్తారు. గతంలో ఒక గోరు లక్షల రూపాయలు పలికినట్లు తెలుస్తోంది. రాను రానూ ఫారెస్ట్ అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించడం వల్ల పులిగోళ్ళు దొరకడం కష్టంగా మారింది. అప్పట్లో కొనుగోలు చేసినవారు ఫారెస్ట్ అధికారుల భయంతో ఇంట్లొ భద్రపరచుకుంటున్నారు. ఎంతో విలువైన పులిగోళ్ళు ఇప్పుడు ఫారెస్ట్ ఉద్యోగి సహాయంతో మాయం కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఈ కేసులో ఎవరెవరికి ఎలాంటి శిక్షలు పడతాయో చూడాలి.
