Andhra News: ఇవేవో పిచ్చి రాతలు అనుకుంటే పొరపాటే.. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
కవిసార్వభౌముడు శ్రీనాథుడు పర్యవేక్షించిన కొండవీటి రెడ్డి రాజుల కాలం నాటి శాసనాలు తాజాగా బయటపడ్డాయి. క్రీ.శ. 1404 నాటి ఈ శాసనాల్లో పెదకోమటి వేమారెడ్డి, భాస్కరాచార్యులకు పొన్నవోలు అగ్రహారం దానం చేసినట్లు ఉంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బృందం వీటిని పరిశీలించి, పాలనా, దానధర్మాల విశేషాలను వెల్లడించింది. విద్యాభాస్కర్ వద్ద లభించిన ఈ పురాతన ఆధారాలు రెడ్డి రాజుల చరిత్రపై కొత్త వెలుగును ప్రసరింపజేస్తున్నాయి.

రెడ్డి రాజుల కాలంలో శ్రీనాథుడు ఒక వెలుగు వెలిగాడన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కవిసార్వభౌముడిగా బిరుదును పొందిన ఈయన ఎన్నో గొప్ప కావ్యాలను రచించారు. ఆయన చెప్పిన చాటువులు తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే ఆయన స్వయంగా పర్యవేక్షించిన శాసన ప్రతులు కొన్ని తాజాగా బయపడ్డాయి. వాటిలో ఉన్న అంశాలను పరిశీలించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎఫిగ్రఫి విభాగం డైరెక్టర్ ముణి రత్నంరెడ్డి వాటి గురించి కీలక విషయాలను తెలిజేశారు.
పొన్నవల్లి అగ్రహారానికి చెందిన విద్యాభాస్కర్ అనే వ్యక్తి దగ్గర ఈ శాసనాలు ఉన్నట్టు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ అధికారులు తెలుసుకున్నారు. పొన్నవల్లి వంశానికి చెందిన 22వ తరం వారసుడైన విద్యాభాస్కర్ ఈ శాసనాలను హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ కాలం నాటి శాసనాల గురించి తెలుసుకున్న మణి రత్నంరెడ్డి బృందం హైదరాబాద్ వెళ్లి విద్యాభాస్కర్ ను కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఆ కాలం నాటి శాసనాలను ఈ బృందం సభ్యులకు చూపించారు.
వాటిని పరిశీలించిన సభ్యులు ఈ శాసనాలు 620 ఏళ్ల నాటివిగా తేల్చారు. ఇవి 1,404లో కొండవీటి రెడ్డి రాజ్యాన్ని పాలించిన పెదకోమటి వేమారెడ్డి కాలం నాటి శాసనాలుగా గుర్తించారు. వేమారెడ్డి ఆస్థానంలో అష్టాంగ వేద విద్య, సర్పశాస్త్ర ప్రావీణ్యుడైన భాస్కరాచార్యులకు పొన్నవోలు అగ్రహారాన్ని దానమిచ్చినట్లు ఉందని తెలిపారు. అయితే ఈ శాసనాలను అప్పటి ఆస్థాన కవి అయిన శ్రీనాధుడే ప్రత్యేక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తుంది. ఈ శాసనాల ద్వారా ఆనాటి పాలనా, పాండిత్యం, దానధర్మాలకు చెందిన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నో ఏళ్లుగా ఈ పురాతన శాసనాలను భద్రపరుస్తూ వస్తున్న విద్యాభాస్కర్‌ను ముణి రత్నంరెడ్డి బృందం అభినందించారు. చారిత్రక సంపద నిర్లక్ష్యానికి గురికాకుండా ఇలాంటి వ్యక్తులే వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపించి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యా భాస్కర్ కూడా ఆకోవకు చెందిన వారేనని ఆయన అన్నారు. శాసనాల నకళ్లు సేకరించిన మణి రత్నం టీసం సభ్యులు వాటిని మరింత లోతుగా పరిశీలించేందుకు తమ వెంట తీసుకెళ్లారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
