Kurnool: శివాలయంలో రెచ్చిపోయిన కేటుగాళ్లు.. రూ.3 లక్షల పెట్టుబడితో రెండు రోజుల్లో రూ.30 లక్షల ఆదాయం
కర్నూలు జిల్లా గడివేములలోని శ్రీదుర్గాభోగేశ్వర క్షేత్రంలో ఘరానా మోసగాళ్లు మాయమాటలు చెప్పి భక్తులను దోచుకున్నారు. రూపాయికి రూ.10లని, రూ.10లకి వంద రూపాయలని ఆశచూపి భక్తుల వద్ద..
కర్నూలు జిల్లా గడివేములలోని శ్రీదుర్గాభోగేశ్వర క్షేత్రంలో ఘరానా మోసగాళ్లు మాయమాటలు చెప్పి భక్తులను దోచుకున్నారు. రూపాయికి రూ.10లని, రూ.10లకి వంద రూపాయలని ఆశచూపి భక్తుల వద్ద ఉన్నదంతా దోచుకున్నారు. ఇలా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ.3 లక్షల పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షల ఆదాయం గడించారు. పవిత్ర క్షేత్రంలో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
పవిత్రమైన దుర్గాభోగేశ్వర క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలకు హాజరైన వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లే క్రమంలో కొందరు ‘కాయ్ రాజా కాయ్’ జూద కార్యక్రమాల పేరుతో ప్రలోభపెట్టి లక్షల రూపాయను దోచుకున్నారు. నిజానికి గత 15 ఏళ్లుగా మండలంలో ఇలాంటి జూద కార్యక్రమాలు నిర్వహించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఏడాది అధికారులే అనుమతులు ఇవ్వడంతో ఆట నిర్వాహకులు రెచ్చిపోయారు. ఏకంగా పదుల సంఖ్యలో టేబుళ్లు ఏర్పాటు చేసి బహిరంగంగా ఆట నిర్వహించి రెండు రోజుల పాటు భక్తులను యథేచ్ఛగా దోచుకున్నారు. అధికారులు కిమ్మనకుండా ఉండేందుకు కాయ్ రాజాకాయ్ ఆట నిర్వహణకు రూ.3 లక్షల మామూళ్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా కేవలం రెండు రోజుల వ్యవధిలో భక్తుల నుంచి రెండు రోజుల్లో రూ.30 లక్షలు దోచుకున్నట్లు సమాచారం. కొందరు తెచ్చుకున్న డబ్బులు అయిపోతే ఇంటికెళ్లి తెచ్చుకుని మరీ మళ్లీ ఆడారట. ఆట మాయలోపడి వేల రూపాయల డబ్బు పోగొట్టుకున్న వారు లబోదిబోమంటున్నారు. ఎన్నడూ లేని విధంగా మండలం కాయ్‌రాజా కాయ్‌కు అనుమతులు ఇచ్చిన అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.