OMC Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్.. అభియోగాలను కొట్టివేసిన హైకోర్టు..
ఒబులాపురం మైనింగ్( ఓఎంసీ) కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు..
ఒబులాపురం మైనింగ్( ఓఎంసీ) కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోవడంతో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఓఎంసీ కేసు నుంచి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. దీంతో సిబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాది పాటూ జైల్లో ఉన్నారు. ఒబులాపురం మైనింగ్( ఓఎంసీ) కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం నిర్దోషిగా పరిగణించింది. దీంతో శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలగినట్లైంది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలు శ్రీలక్ష్మి. 2011లో ఆమె అరెస్ట్ అయ్యారు. 2011లో అక్రమ మైనింగు కేసులో అరెస్టవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ తో విడుదలయ్యారు.
జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తి వేసింది. అభియోగాల పై కింది కోర్టు నుండి పై కోర్టు వరకు శ్రీలక్ష్మి తన వాదనలను వినిపించారు. ఇండస్ట్రీయల్ సెక్రటరీగా తన పరిధి దాటకుండా వ్యవహరించారని శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బాధ్యతల నేపథ్యంలో ఓఎంసీ వ్యవహరాలను ఆమె చూశారని న్యాయవాదులు వాదించారు. శ్రీలక్ష్మి మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో చాలా మంది ధరఖాస్తులు చేసుకున్నా గాలి జనార్ధన్ రెడ్డికి మేలు కల్గించేలా వ్యవహరించారని సీబీఐ వాదించింది. ఆరు మాసాలుగా ఉన్న లీజును మూడేళ్లకు పొడిగించారని సీబీఐ హైకోర్టులో తన వాదనలను విన్పించింది.
1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఆయాచిత లబ్ధి కలిగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయి దాదాపు ఏడాది పాటూ జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్‌లో ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీకి బదిలీ అయ్యారు. ఏపీ కేడర్‌కు రాగానే ఆమెకు పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి అబౌ సూపర్‌టైమ్ (హెచ్‌ఏజీ స్కేల్), లెవెల్ 15కి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆ శాఖలోనే ముఖ్య కార్యదర్శిగా నియమించింది. వాటిని ‘రెగ్యులర్ ప్రమోషన్లు’గానే పరిగణించారు. ఆమెపై పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉండనుంది. ఆమెకు అబౌ సూపర్‌టైమ్ స్కేల్ (2), అపెక్స్‌స్కేల్- లెవెల్ 17కి పదోన్నతి కల్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దాన్ని అడ్‌హాక్ ప్రమోషన్‌గా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..