AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ByPoll Result: అక్కడ నోటాకు రెండో స్థానం.. మునుగోడులో ఆ అభ్యర్థులకంటే ఎక్కువ ఓట్లు..

దేశ వ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన తెలంగాణలోని మునుగోడుతో పాటు మరో ఆరు శాసనసభ స్థానాలకు కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ ఆరో తేదీన విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనేక ఆసక్తిఘటనలు..

ByPoll Result: అక్కడ నోటాకు రెండో స్థానం.. మునుగోడులో ఆ అభ్యర్థులకంటే ఎక్కువ ఓట్లు..
Evm (file Photo)
Amarnadh Daneti
|

Updated on: Nov 07, 2022 | 1:08 PM

Share

దేశ వ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన తెలంగాణలోని మునుగోడుతో పాటు మరో ఆరు శాసనసభ స్థానాలకు కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ ఆరో తేదీన విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనేక ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రధానపార్టీల మధ్య పోటీ ఉంటుంది. అలాగే స్వతంత్య్ర అభ్యర్థులు ఎంతో మంది పోటీ చేస్తారు. అలాగే కొంతమంది ప్రజలకు తమకు ఏ అభ్యర్థి నచ్చకపోతే ఓటు వేయకుండా ఉండాకుండా.. వారు తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 2013లో తొలిసారి నోటాను పరిచయం చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయ్యొచ్చు. దీనిని ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా మంది నోటాకు తమ ఓటు వేశారు. ప్రధానంగా నిరక్షరాస్యులు, వృద్ధులు అయితే తాము ఎవరికి ఓటు వేయాలో ముందే డిసైడ్ అయిపోతారు. దీంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. ఆగుర్తుపై ఓటు వేసి వస్తారు. ప్రధానంగా అక్షరాస్యులు, విద్యాధికులు మాత్రమే నోటాను ఉపయోగించే అవకాశం ఉంటుంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో శివసేన (ఉద్దవ్ థాక్రే వర్గం) తరపున పోటీచేసిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఏడుగురు పోటీచేయగా మిగిలిన ఆరుగురికి డిపాజిట్లు కాదు కదా.. ఏ ఒక్కరికి 1600 ఓట్లు దాటలేదు. కాని ఈ నియోజకవర్గంలో నోటా రెండో స్థానంలో నిలిచింది. ఏకంగా 12,806 ఓట్లు నోటాకు పోలయ్యాయి. మొత్తం 86570 ఓట్లు పోలవ్వగా.. శివసేనశివసేన (ఉద్దవ్ థాక్రే వర్గం) అభ్యర్థికి 66,530 ఓట్లు రాగా, నోటాకు 12,806 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థికి నోటాకు చాలా ఓట్ల తేడా ఉంది. మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థికి కేవలం 1, 571 ఓట్లు రాగా నోటాకు, ఈ అభ్యర్థికి మధ్య 11,235 ఓట్ల తేడా ఉంది.

అంధేరీ (ఈస్ట్) సిట్టింగ్‌ ఎమ్మెల్యే రమేశ్‌ లట్కే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) వర్గం అభ్యర్థి, రమేశ్‌ లట్కే సతీమణి రుతుజ లట్కే విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ, ఏక్‌నాథ్‌ శిండే వర్గం తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ ఏకపక్షమే అయింది. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కూడా రుతుజాకే మద్దతు ఇవ్వడంతో చివరకు స్వతంత్రులు మాత్రమే బరిలో ఉన్నారు. శివసేన ఉద్ధవ్‌ వర్గానికి ఈసీ కేటాయించిన కొత్త గుర్తు కాగడాతో ఈ ఎన్నికల బరిలో నిలవగా.. రుతుజాకు 66,530 ఓట్లు వచ్చాయి. అయితే, బరిలో నిలిచిన ఆరుగురు అభ్యర్థుల కన్నా నోటాకే అధికంగా ఓట్లు రావడం విశేషం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక కూడా ఇదే.

తెలంగాణలోని మునుగోడులో కూడా ఇలాంటి దృశ్యం కన్పించింది. ఇక్కడ 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికి.. ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య సాగిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ నోటాకు 482 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే నోటా కంటే తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు 37 మంది ఉన్నారు. అంటే ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడులో కూడా నోటా 10వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ఉద్యమకారుడు కోదండరామ్ పార్టీ తెలంగాణ జనసమితి అభ్యర్థికి మొత్తంగా 200 ఓట్లు కూడా రాలేదు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మినహిస్తే నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థులు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. వారిలోనూ ఇద్దరికి వారి గుర్తులు కలిసొచ్చాయి. రోడ్ రోలర్, చపాతి గుర్తులు కొంత కారుగుర్తును పోలి ఉండటంతో వృద్ధులు ఆ గుర్తులపై ఓట్లు వేచి ఉండవచ్చనే చర్చసాగుతోంది. ప్రజాశాంతి పార్టీ అధినేత, స్వతంత్య్ర అభ్యర్థి డాక్టర్ కె.ఎ.పాల్ నోటా కంటే ఎక్కువ ఓట్లే తెచ్చుకున్నారు. ఆయనకు 805 ఓట్లు రాగా.. ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 47 మంది అభ్యర్థులు పోటీపడగా.. కె.ఎ.పాల్ 8వ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..