AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (TRS) పోటీ చేస్తుందా.. ఈ స్థానాలపై ప్రధాన దృష్టి..?

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ లో కొత్త ఉత్సహం కనిపిస్తోందంటున్నారు పార్టీ శ్రేణులు. టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి విజయం.. జాతీయ పార్టీ ప్రకటించాక తమకు తొలివిజయమని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. భారత్ రాష్ట్ర సమితికి ఈ విజయం..

Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (TRS) పోటీ చేస్తుందా.. ఈ స్థానాలపై ప్రధాన దృష్టి..?
BRS
Amarnadh Daneti
|

Updated on: Nov 07, 2022 | 10:21 AM

Share

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ లో కొత్త ఉత్సహం కనిపిస్తోందంటున్నారు పార్టీ శ్రేణులు. టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి విజయం.. జాతీయ పార్టీ ప్రకటించాక తమకు తొలివిజయమని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. భారత్ రాష్ట్ర సమితికి ఈ విజయం శుభశకునంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు మునుగోడు పునాది అవుతుందని గతంలోనే సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక ముందే టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చడంతో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలో కొత్తపార్టీ పేరుతో పోటీచేయాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. సాంకేతిక కారణాలతో టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు బరిలో నిలవాలని నిర్ణయించారు సీఏం కేసీఆర్. బీఆర్ఎస్ పేరును ఎక్కువుగా ప్రస్తావించకుండా.. టీఆర్ఎస్ పేరుతో.. కారు పార్టీ గుర్తంటూ మునుగోడులో ప్రచారం నిర్వహించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బీఆర్ఎస్ పేరు పూర్తిగా తెలియకపోవడంతో టీఆర్ఎస్ పేరుతో ప్రచారం చేశారు. అయినా బహిరంగం సభలో మాత్రం తన జాతీయ రాజకీయాలకు, జాతీయ పార్టీకి మునుగోడు విజయం పునాదిరాయి అంటూ కేసీఆర్ ప్రకటించారు. అనుకున్నట్లే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం బీఆర్ఎస్‌కు మంచి బూస్ట్‌నిచ్చిందనే చెప్పుకోవాలి. మునుగోడులో విజయంతో ఇప్పుడు బీఆర్ఎస్‌గా ప్రజల ముందుకెళ్లేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇక జాతీయస్థాయిలో ఏలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక పూర్తికావడంతో.. ఇక ఎన్నికల సంఘాన్ని కలిసి తమ పార్టీ రు మార్పునకు సత్వరమే ఆమోదం తెలపాలని కోరనుంది. అవసరమైతే ఈ విషయంలో న్యాయపరంగా పోరాడాలని ఆ పార్టీ భావిస్తోంది. పేరు మార్పును ఎన్నికల సంఘం ఆమోదించిన వెంటనే.. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటించే అవకశం ఉంది.

తెలంగాణ రాష్ట్ర విభాగానికి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ అధ్యక్షుడిగా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే సీనియర్ నాయకులకు జాతీయ కార్యవర్గంలో పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనభ సభ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఒకే దశలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఈ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఇక్కడ పోటీచేసే అవకాశం లేదు. అయితే ఏదైనా పార్టీకి మద్దతు తెలుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో కొన్ని చోట్ల పోటీచేయాలని ఆ రాష్ట్రంలోని తెలంగాణ వాసులు, టీఆర్ఎస్ అభిమానుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సూరత్ తో పాటు తెలుగువారు ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లో పోటీచేయాలనే డిమాండ్ ఉందని, దీనిపై సీఏం కేసీఆర్ ఓ నిర్ణయాన్ని అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సూరత్, నవసారి, చోర్యాసి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అభ్యర్థులను గుర్తించినట్లు సమాచారం. అయితే తమ పార్టీ కార్యకలాపాలు మొదటగా మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రారంభిస్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే గుజరాత్ లో పోటీచేస్తారా అనేది కొంత అనుమానంగానే ఉంది. బీజేపీకి బాగా పట్టున్న రాష్ట్రం కాబట్టి.. ఇక్కడ తమకు కనీస ఓట్లు రాకపోతే.. పరిస్థితి ఏమిటనేదానిపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మునుగోడు ఫలితం రావడంతో కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టిసారించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..