అయ్యో దేవుడా.. ఇదేం ఘోరం.. వారం రోజుల వ్యవధిలో కళ్లెదుటే కన్నుమూసిన ఇద్దరు పిల్లలు..
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడు పూటలు కడుపు నిండా తిండి దొరకని ఆ గిరిజన కుటుంబాన్ని ప్రకృతి పగపట్టింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులు కళ్ల ముందే కన్నుమూసిన ఘటన అందరినీ కలిచివేస్తుంది.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడు పూటలు కడుపు నిండా తిండి దొరకని ఆ గిరిజన కుటుంబాన్ని ప్రకృతి వెంటవెంటనే పగపట్టింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులు.. తల్లిదండ్రుల కళ్ల ముందే కన్నుమూసిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. నిమ్మకాయల గోవింద, పద్మ అనే దంపతులు కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రసాద్ (21) రెండు కిడ్నీలు పూర్తిగా పనికి రాకపోవడంతో డయాలసిస్ మీద ఆధారపడుతూ జీవిస్తున్నాడు. ఇంతలో చిన్న కుమారుడు మోహన్ కృష్ణ (19) కూడా అనారోగ్య బారిన పడ్డాడు. మోహన్ క్రష్ణ కు వైద్య పరీక్షలు చేయించడంతో క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా తమ కుమారులను బ్రతికించుకోవాలని తల్లిదండ్రులు ఎంతగానో శ్రమించారు. పిల్లల ప్రాణాలు నిలుపుకోవాలనే తపనతో తమకు ఉన్న నలభై సెంట్ల భూమిని కూడా అమ్మేశారు. ఇక అమ్మడానికి ఆస్తి ఏమీ లేకపోవడంతో చేసేదిలేక సుమారు ముప్పై లక్షల వరకు అప్పు చేసి మరీ వైద్యం చేయించారు.
కానీ విధి మాత్రం ఆ దంపతులను కరుణించలేదు. పది రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధి మరింత ముదిరి అనారోగ్యంతో తల్లిదండ్రుల కళ్ల ముందే కన్ను మూశాడు పెద్ద కొడుకు ప్రసాద్. దీంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. అన్నయ్య మృతిని తమ్ముడు మోహన్ కృష్ణ కూడా తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అన్నయ్య లేకుండా నేను ఉండలేను, అప్పుల్లో ఉన్న మీకు నేను భారం కాకూడదు అంటూ తల్లిదండ్రుల ఎదుటే ఆవేదనకు గురై పురుగుల మందు తాగాడు చిన్న కొడుకు మోహన్ క్రష్ణ.. దీంతో అక్కడే ఉన్న తల్లిదండ్రులు హుటాహుటిన విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. మోహన్ కృష్ణ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దీంతో ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. పిల్లలను బ్రతికించాలని ఎన్నో బాధలు పడి, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని అప్పులతో రోడ్డున పడ్డా పిల్లలు దక్కకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లాలో జరిగిన ఈ ఘటన విషాదంలో ముంచెత్తేలా చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
