Andhra Pradesh: 2 కిలోల పులసకు రూ.26వేలు… యానాంలో మరోసారి రికార్డు ధర పలికిన పులస చేప
పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. గోదావరి జిల్లాలో బాగా వినిపించే మాట ఇది. పులస చేపకు ఉండే క్రేజ్ ఇది. గోదావరికి వరద నీటి తాకిడి పెరిగిడంతో పులసల సీజన్ కూడా మొదలైంది.. గోదావరి ప్రాంతంలో పులసల జాతర నడుస్తోంది. గోదావరి తీరానికి సమీపంలో ఉండే యానాం ప్రాంతంలో...

పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. గోదావరి జిల్లాలో బాగా వినిపించే మాట ఇది. పులస చేపకు ఉండే క్రేజ్ ఇది. గోదావరికి వరద నీటి తాకిడి పెరిగిడంతో పులసల సీజన్ కూడా మొదలైంది.. గోదావరి ప్రాంతంలో పులసల జాతర నడుస్తోంది. గోదావరి తీరానికి సమీపంలో ఉండే యానాం ప్రాంతంలో ఈ చేపలు దొరుకుతుండటంతో అక్కడికి చేపల ప్రియులు క్యూ కడుతున్నారు. యానాంలో మరోసారి పులస చేప రికార్డు ధర పలికింది. 2 కేజీల పులసకు రూ.26వేలు ధరను వెచ్చించి కొనుగోలు చేవారు. ఈ చేపను ఆత్రేయపురం పేరవరం వాసి సతీష్ వేలంలో దక్కించుకున్నారు. వారంరోజుల్లోనే రికార్డు ధరకు అమ్ముడుపోయాయి రెండు పులసలు. మొన్న 18వేలు.. నిన్న 22వేలు.. ఇప్పుడు 26వేలు ధర పలకడంతో మత్స్యకారుల పంట పండినట్లయింది.
నైరుతి ఎఫెక్ట్‌తో ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతుండటంతో పులసల సందడి కూడా మొదలైంది. యానాం పుష్కర్ ఘాట్ వద్ద కేజీపైన ఉన్న పులస చేపను మత్స్యకారులు వేలం వేశారు. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతాయని, గోదావరికి ఔషధ గుణాలున్న ఎర్ర నీరు వచ్చినప్పుడు.. ఈ చేపలు అందులో ఎదురీదటం వల్లనే దీనికి అంతరుచి అని మత్యకారులు చెబుతున్నారు.
ఈ సీజన్‌లో గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో పులసలు పడుతున్నాయని, వచ్చే రెండు నెలల్లోనూ పులసలు విరివిగా దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మత్యకారులు. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు మంచి పేరున్నా.. ఏటికేడు వాటి లభ్యత తగ్గిపోతోందని వారు తెలిపారు. గతంలో గోదావరి జిల్లాలో ఏడాదికి సగటున 3 టన్నుల పులసలు దొరికేవని, ఇప్పుడు అది రెండు మూడు క్వింటాళ్లకు పడిపోయిందని వారు చెబుతున్నారు.
