Andhra Pradesh: కొడుకుని మర్చిపోలేక నరకయాతన.. మదిలోని జ్ఞాపకాలకు తిరిగి ప్రాణం పోసిన అమ్మనాన్నలు..
కన్నకొడుకుని హఠాత్తుగా మృత్యువు కబళిస్తే ఆ కుటుంబం అంధకారంలో కూరుకుపోతుంది. ఆ జ్ఞాపకాల దొంతరల్లో నుంచి బయటపడటం అంత తేలిక కాదు..అందుకే కోనసీమలోని ఓ తండ్రి ఇంటినే గుడిగా మార్చేశాడు. కొడుకు విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్టించుకున్నాడు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు.. తన బిడ్డ ఆకాశమంత ఎత్తు ఎదగాలని ఆ తండ్రి ఆకాంక్ష. అర్థంతరంగా ఆ స్వప్నలోకాలు అదృశ్యమయ్యాయి. కొడుకు శాశ్వతంగా దూరమయ్యాడన్న వార్త అతడిని అగాధంలోకి తోసేసింది. కొడుకు మృత్యువార్త ఆ ఇంట్లో కల్లోలం రేపింది. కొడుకుని మర్చిపోలేని ఆ తండ్రి.. కొడుకు రూపాన్ని శాశ్వతంగా ఇంట్లో నిలుపుకున్నాడు. చిన్నప్పుడు వేలుపట్టుకు నడిపించిన తండ్రి.. అల్లారుముద్దుగా పెంచుకుని.. గుండెలపై ఆడించి, పాడించి పెంచుకున్న కన్నబిడ్డ హఠాత్తుగా మాయమైతే ఎలా ఉంటుంది? కొడుకుని కోల్పోయిన ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ.. యాతన మరణంకన్నా దారుణంగా ఉంటుంది. బతుకు వ్యర్థమన్న భావన ఆ ఇంటిని చుట్టుముడుతుంది. అంతులేని విషాదం ఆ ఇంటిల్లిపాదినీ నరకంలోకి నెట్టేస్తుంది. తోకల ఏసుదాస్ ఇంట్లోనూ అదే జరిగింది. వినయ్.. వినయవిధేయతలు ఉట్టిపడే కొడుక్కి అదే పేరు పెట్టుకున్నాడు ఆ తండ్రి. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన వినయ్‌ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
కానీ విధి వక్రించింది. ఇదిగో వస్తానని వెళ్ళిన కొడుకు తిరిగిరాలేదు..ఇక తిరిగి రాని లోకాలకు చేరిపోయాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లికి చెందిన తోకల వినయ్ గత ఏడాది ఏప్రిల్ 15న గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. కొడుకు హఠాత్తుగా దూరమవడం ఆ కుటుంబాన్ని కలచివేసింది.
కొడుకుని మర్చిపోలేక నరకయాతనను అనుభవించారు ఆ తల్లిదండ్రులు. వినయ్ తండ్రి తన కొడుకు కోసం గుండెల్లోనే గుడికట్టుకుని అనుక్షణం జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. అయినా ఆ తల్లిదండ్రుల మనస్సు శాంతించలేదు. తన కొడుకుని కోల్పోయిన బాధలో నుంచి తేరుకోలేక…అతడి జ్ఞాపకాల్లోనుంచి బయటకు రాలేక.. కొడుకు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కొడుకు వినయ్ విగ్రహాన్ని ఇంటి ఆవరణలో పెట్టకుని కొడుకుతో గడిపిన అపురూప జ్ఞాపకాలను పొదివిపట్టుకుని గుండెలు దిటవుచేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఈ దృశ్యం అందర్నీ కంటతడిపెట్టిస్తోంది.
వినయ్ మరణాన్ని తట్టుకోలేని తండ్రి.. క్షణమైనా కొడుకు జ్ఞాపకాలు చెదరకుండా ఉండేలా వినయ్ విగ్రహాన్ని ఇంటి ఆవరణలో ప్రతిష్టించుకున్నాడు. తల్లిదండ్రులకోసం గుడులు కట్టి పూజించిన కొడుకులను చూశాం. కానీ కోనసీమ జిల్లాలో కన్న కొడుకు కోసం ఈ తండ్రి ఇంట్లోనే విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు కోనసీమ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..