AP News: ఎస్సైనని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. కట్ చేస్తే ఏడాది తర్వాత..
ఎస్సై అని చెప్పి ఓ మహిళను మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. ఆమెకు అండగా ఉంటానన్నాడు.. ఇద్దరు ఆడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు. కొంతకాలానికి అతని మాటలను నమ్మింది ఆమె.. పెళ్లి చేసుకుంది.
ఆమె ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. ఆ ఆసుపత్రికి తన తల్లిని తీసుకొని సాయి కిరణ్ అనే యువకుడు వచ్చేవాడు. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తూ పోతూ ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్న విషయాన్ని సాయి కిరణ్ తెలుసుకున్నాడు. అప్పటి నుండి ఆమెతో మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. వాట్సప్‌లో ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు. తెనాలిలో ఉంటూ ఎస్సైగా పనిచేస్తున్నట్లు సాయి కిరణ్ తనని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ఇల్లు కట్టుకుంటున్న విషయం తెలుసుకొని తక్కువ ధరకే బిల్డింగ్ మెటీరియల్స్ ఇప్పిస్తానని చెప్పి ఇరవై మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు. కొద్ది రోజుల పోయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అయితే అప్పటికే జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న ఆమె మరొక వివాహానికి చేసుకోవడానికి వెంటనే సిద్దపడలేదు. అయితే తాను ఎస్సైనని.. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు అండగా ఉంటానని సాయి కిరణ్ నమ్మబలికాడు. దీంతో ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంది.
2023లో విజయవాడ అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి సాయి కిరణ్ సాధారణ దుస్తుల్లోనే ఇంటి నుండి వెళ్లిపోతుండేవాడు. ఒకటి రెండు సార్లు పోలీస్ డ్రెస్ ప్రస్తావన తీసుకొచ్చినా ఏదో దాటవేస్తూ వెళ్లిపోయేవాడు. ఈక్రమంలోనే ఆమె తమ్ముడి చేత కారు కొనించి.. అద్దెకు తిప్పుదామన్న ప్రతిపాదన చేశాడు. ఇందు కోసం ఆమె పది లక్షల రూపాయలను తీసుకొచ్చి సాయి కిరణ్‌కి ఇచ్చింది. కొద్దీ రోజుల తర్వాత సాయి కిరణ్ ఆ కారు తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకురాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె వెంటనే సాయి కిరణ్‌ను నిలదీసింది. ఎస్సై అయితే డ్రెస్ ఎందుకు వేసుకొని వెళ్లడం లేదంటూ ప్రశ్నించింది. ఒక రోజు స్టేషన్‌లో ఉన్నానని చెప్పడంతో వీడియో కాల్ చేస్తానని అడిగింది. అందుకు సాయి కిరణ్ ఒప్పుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె సాయి కిరణ్ గురించి విచారించగా అసలు అతను పోలీసే కాదని తెలిసింది. ఆధార్ కార్డు అడ్రస్ ద్వారా అతని ఇంటికి వెళ్లగా… సాయి కిరణ్‌కు భార్య ఇద్దరూ పిల్లలున్నట్లు తేలింది. అప్పటి నుండి సాయి కిరణ్ జాడ లేకుండా పోయాడు. సాయి కిరణ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ పోలీసులకు ఐటి రిటర్న్స్ దాఖలు చేసేవాడని తెలుసుకున్న ఆమె తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చింది. అయితే అప్పటి నుండి సాయి కిరణ్ ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని భావించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలస్ డ్రెస్‌లో ఉన్న సాయి కిరణ్ ఫోటోలను అధికారులకు ఇచ్చి అతని చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్తాయి దర్యాప్తు చేయాలని ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..