Andhra Pradesh: ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్..
ఆంధ్ర మిర్చి ఘాటు అమెరికాను తాకింది. ప్రతి ఏడాది వేల టన్నులు మిర్చి కారం యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇండియా నుండి 2025లో 7.15 లక్షల టన్నుల మిర్చి విదేశాలకు ఎగుమతి అవ్వగా, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే 44శాతం ఉండడం గమనార్హం. మిర్చి ఎగుమతితో కేంద్రానికి రూ.11 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రధానంగా ఆంధ్రా మిర్చి కోసం విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రా మిర్చికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుంది.

ఆంధ్రాలో సారవంతమైన నేల, మిర్చి పంటకు అనువుగా ఉండడంతో ఈ ప్రాంతంలో మిరప పంట ఎక్కువగా పండుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో మిరప పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో నాణ్యమైన మిర్చి సాగు అవుతుండడంతో వ్యాపారులు ఈ మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ఉండడంతో రైతులు కూడా ఆంధ్రా రైతులు మిర్చి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్న మిర్చి ప్రపంచ దేశాలలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గుంటూరు సన్నం, బ్యాది, తేజ, 334, ముండు ఈ ఐదు రకాలను అంతర్జాతీయ కొనుగోలుదారులు ఇష్టపడుతుంటారు. మన దేశంలో పండే ఎర్ర మిరపకాయలు మన మార్కెట్ ను ప్రపంచంలో ప్రధాన ఉత్పత్తుల్లో భాగంగా నిలుపుతున్నాయి.
ప్రపంచ దేశాలలో బహుళ పరిశ్రమలలో మన మిర్చి కీలక పాత్ర పోషిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి సాసులు, సీజనింగులు, మసాలా మిశ్రమాలు వాడుతుంటారు. ఫార్మా సూటికల్స్‌కు సంబంధించి వివిధ రకాల నొప్పి నివారణ క్రీమ్ లకు, బరువు తగ్గించే సప్లిమెంట్లకు, రోగ నిరోధక మందులలో కీలకంగా ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాలలో మిర్చి సారాన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, జుట్టు పెరుగుదల చికిత్సలలో వాడుతారు. కొన్ని ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలలో కారంగా ఉండే రుచి కోసం కూడా వాడతారు. తెగులు నియంత్రణకు మిర్చిలో ఉండే యాంటీ మైక్రోబయాల్ లక్షణాల కారణంగా, సహజ పురుగుమందుల్లో ఈ మిర్చి కారాన్ని ఉపయోగిస్తారు.
యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, బంగ్లాదేశ్, మలేషియా లాంటి దేశాలకు మిర్చి ఎగుమతి అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మిర్చి డిమాండ్‌కు తగ్గట్టు నాణ్యమైన మిరపకాయలను పండిస్తూ ఇండియా ప్రతి ఏడాది ఎగుమతులను పెంచుతుంది. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా విదేశీ కంపెనీలు భారతదేశంలో ఏపీ తెలంగాణలలో పాగా వేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మిర్చి రైతులతో విదేశీ కంపెనీలు ఒప్పందాలు చేసుకొని పంటను దగ్గరుండి పండిస్తున్నారు. ఎక్కువ పురుగులు మందులు వాడకుండా ఆర్గానిక్ పంటలాగా మిర్చీని పండిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాలనుండి సేకరించిన మిర్చి ని గ్రేడులుగా విభజిస్తారు. హైద్రాబాద్ తరలించి ఫ్యాక్తరి లో మిర్చీని పౌడర్‌గా చేస్తారు. ఆ కారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తారు.
ఇప్పటికే వాళ్ల స్కీమ్స్‌కి ఆకర్షితులై రైతులు పెద్ద ఎత్తున మిర్చిని విదేశీ కంపెనీలకు అమ్ముతున్నారు. ప్రత్యేకించి ఆంధ్రలో మిర్చి పంట పండించే వారికీ డిమాండ్ బాగా పెరిగింది. ఇక్కడ వాతావరణం బాగుంటుంది. మిర్చి పొలాలు బాగున్నాయి. పండిన మిర్చీని కంపెనీల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశీ కంపెనీలలో చేరడం ఆనందంగా ఉందని.. మిగిలిన వారి కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయని, తమకు పంట ధర ముందుగా నిర్ణయించి లాభం, నష్టం సంబంధం లేకుండా చెప్పిన ధరకు మిర్చిని కొనుగోలు చేస్తారని రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట వేసిన దగ్గర నుండి అన్నీ కంపెనీ వాళ్లే చూసుకుంటారు. కంపెనీ సిబ్బంది పంటని పర్యవేక్షిస్తారు. వాళ్ళు చెప్పినట్లు పురుగుల మందులు ఎక్కువ వాడకుండా.. కంపెనీ వాళ్ల సలహా మేరకు రైతులు పంట పండిస్తున్నారు.
ఆంధ్ర మిర్చి కారాన్ని సాస్‌లకు, మసాలాలకు, కేఎఫ్‌సీ మసాలాలకు వాడతారు. ఫార్మా కంపెనీలు, యూఎస్‌తోపాటు పలు దేశాలలో ఆంధ్ర మిర్చికి మంచి డిమాండ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల దగ్గర సేకరించిన మిర్చీని గ్రేడులుగా విభజించి హైదరాబాద్‌లోని కంపెనీ ఫ్యాక్టరీలో స్టోర్ చేసి అక్కడ నుండి విదేశాలకు తరలిస్తామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. మిర్చి పంటను కొనేందుకు విదేశీ ప్రతినిధులు వస్తుండడంతో ఎన్టీఆర్ జిల్లా రైతులలో ఆనందం కనిపిస్తుంది. మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర తో పాటు మా మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతున్నందుకు గర్వంగా ఉందని రైతులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
