Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్‌చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్
అర్ధరాత్రి వేళ.. మద్యం మత్తులో బైకులపై వచ్చిన నలుగురు యువకులు.. చేతిలో గండ్ర గొడ్డలి.. బీర్ బాటిళ్లు పగులగొడుతూ ఓ వ్యక్తిని చంపేస్తామంటూ వీరంగం సృష్టించారు. సత్తెనపల్లిలో ఒక వివాహేతర సంబంధం చినికి చినికి గాలివానలా మారి హత్యాయత్నం వరకు వెళ్ళింది. చివరకు స్థానికులు రంగంలోకి దిగడంతో కిలేడీ భార్య, ఆమె ప్రియుడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వివాహేతర సంబంధం దారుణమైన మలుపు తీసుకుంది. భర్త అడ్డు తొలగించుకోవాలని చూసిన భార్య, ఆమె ప్రియుడు పన్నిన వ్యూహం తలకిందులైంది. మద్యం మత్తులో గండ్ర గొడ్డలితో హల్ చల్ చేసిన యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సత్తెనపల్లికి చెందిన నాగరాజు పునుగుల బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి దొనకొండకు చెందిన భవానితో 14 ఏళ్ల క్రితం వివాహమవ్వగా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితం పునుగుల బండి వద్ద పని చేసే ఒక వ్యక్తి బంధువు మహేష్‌తో భవానికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
బీర్ బాటిళ్లు, గొడ్డలితో హల్‌చల్
గత ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం మహేష్ బెదిరించడంతో నాగరాజు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మళ్లీ కొద్దిరోజుల క్రితమే ఇంటికి వచ్చిన నాగరాజుతో భవాని మరోసారి గొడవ పడింది. దీంతో భవాని తన ప్రియుడు మహేష్‌కి ఫోన్ చేసి పిలిపించింది. మహేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు బైకులపై, మద్యం మత్తులో నాగరాజు ఇంటికి చేరుకున్నాడు. బీర్ బాటిళ్లను రోడ్డుపై పగులగొట్టి.. “నిన్ను, నీ తల్లిని చంపేస్తాం” అంటూ గొడ్డలితో నాగరాజును బెదిరించారు.
రంగంలోకి దిగిన స్థానికులు
రాత్రి సమయంలో నలుగురు యువకులు ఆయుధాలతో హడావుడి చేస్తుండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ప్రధాన నిందితుడు మహేష్ మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు. అయితే మిగిలిన ఇద్దరు యువకులు స్థానికులకు చిక్కారు. వారి వద్ద ఉన్న గొడ్డలిని స్వాధీనం చేసుకున్న జనం, వారిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.
పోలీసుల ఎంట్రీ – అసలు నిజం బయటకి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా భవాని చెప్పడం వల్లే తాము నాగరాజును చంపడానికి వచ్చామని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు భవానితో పాటు మహేష్, అతని స్నేహితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
