AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. లండన్ తరహాలో ‘అమరావతి ఐ’.. గోవా తరహాలో ‘బీచ్ షాక్స్’..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పర్యాటకం, ఉపాధి, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంచలన, కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. గోవా తరహాలో బీచ్ టూరిజం డెవలప్‌మెంట్, లండన్ తరహాలో 'అమరావతి ఐ' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. లండన్ తరహాలో 'అమరావతి ఐ'.. గోవా తరహాలో 'బీచ్ షాక్స్'..
Minister Kolusu Parthasarathy
Balaraju Goud
|

Updated on: Jun 04, 2026 | 9:09 PM

Share

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పర్యాటకం, ఉపాధి, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంచలన, కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. గోవా తరహాలో బీచ్ టూరిజం డెవలప్‌మెంట్, లండన్ తరహాలో ‘అమరావతి ఐ’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

రాజధాని అమరావతిలో పర్యాటకాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు కృష్ణా నది తీరంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సరికొత్త ‘బీచ్ షాక్స్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో భీమిలి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చీరాల బీచ్‌ల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నారు. గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బీచ్ షాక్స్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఇక్కడ కేవలం పరిమిత రకాల మద్యం విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.

అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనితో పాటు ‘ఏపీ ఏవియేషన్ పాలసీ-2026’కు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసులను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా కొత్తగా 21 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉద్యోగుల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీపీఎస్ (CPS) అమల్లోకి రాకముందు నోటిఫికేషన్లు వచ్చి, వివిధ కారణాల వల్ల సీపీఎస్ అమల్లోకి వచ్చాక ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పింఛను వ్యవస్థ (OPS) అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీలోనూ సవరణలు చేశారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్’ను జూలై 1 నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అవయవ మార్పిడి ప్రక్రియలో అవినీతిని అరికట్టి, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘ట్రాన్స్‌ప్లాటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం-2011’ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే ‘ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025’ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా మద్దువలస, యేలేరు రిజర్వాయర్లలో ఫిషిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి లభించింది. దాంతో పాటు పోలవరం సహా పలు పెండింగ్ ప్రాజెక్టుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు HUDCO నుంచి రూ.300 కోట్ల రుణాలపై ప్రభుత్వ పూచీకత్తు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us