ఎన్డీఏ పక్షాల కీలక నిర్ణయం.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు ఖరారు!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార ఎన్డీఏ కూటమి పక్షాల కీలక సమావేశం గురువారం (జూన్ 04)న అమరావతిలో జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, సభల నిర్వహణతో పాటు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార ఎన్డీఏ కూటమి పక్షాల కీలక సమావేశం గురువారం (జూన్ 04)న అమరావతిలో జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, సభల నిర్వహణతో పాటు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు గానూ తెలుగుదేశం పార్టీ మూడు సీట్లు, జనసేన ఒక సీటు తీసుకోవాలని కూటమి నేతల సమావేశంలో ఒక అవగాహనకు వచ్చారు. జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధినేత త్వరలోనే ప్రకటిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాధవ్ మాట్లాడుతూ.. “టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్టే.. మేమంతా కలిసే ఉంటాం” అని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. జూన్ 9వ తేదీ నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మూడు ప్రధాన నగరాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
* జూన్ 9 (తిరుపతి): ‘సంక్షేమం’ అనే అంశంపై సభ.
* జూన్ 12 (అమరావతి): ‘సుపరిపాలన’పై సభ.
* జూన్ 15 (విశాఖపట్నం): ‘అభివృద్ధి’ అంశంపై సభ నిర్వహించనున్నారు.
ఈ సభల అనంతరం జూన్ 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో అన్ని జిల్లాల్లో రెండేళ్ల పాలనపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం 24 నెలల పాలనలో చేపట్టిన 24 ప్రధాన కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సభల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్న పరిశ్రమలు, పోలవరం, అమరావతి నిర్మాణాలు, విశాఖ రైల్వే జోన్ వంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. కూటమి ఐక్యతను దెబ్బతీయాలని చూసే కొందరు స్వయం ప్రకటిత మేధావుల విశ్లేషణలను తాము పట్టించుకోమని, తామంతా ఒక్కటిగానే ఉంటామని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
