Andhra Pradesh: గంజాయితో పట్టుబడిన ఇంజినీరింగ్ విద్యార్థులు.. విచారణలో విస్తుపోయే విషయాలు..
ఒంగోలులో గంజాయి అమ్ముతూ ఇద్దరు విద్యార్థులు పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ఇంజనీరింగ్ విద్యార్థులే గంజాయి కొనుగోలు, సరఫరా, అమ్మకాలు చేస్తూ గుట్టుగా అక్రమ దందా సాగిస్తున్నట్టు తేలింది. ఓ లాడ్జిలో మకాం వేసిన నలుగురు విద్యార్దులు ఇతర విద్యార్ధులే టార్గెట్‌గా గంజాయిని పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారు.

ఒంగోలులో గంజాయి అమ్ముతూ ఇద్దరు విద్యార్థులు పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ఇంజనీరింగ్ విద్యార్థులే గంజాయి కొనుగోలు, సరఫరా, అమ్మకాలు చేస్తూ గుట్టుగా అక్రమ దందా సాగిస్తున్నట్టు తేలింది. ఓ లాడ్జిలో మకాం వేసిన నలుగురు విద్యార్దులు ఇతర విద్యార్ధులే టార్గెట్‌గా గంజాయిని పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారు. అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ అధికారులు ట్రైనీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను విద్యార్ధి ముసుగులో గంజాయి కొనుగోలు కోసం పంపించి దాడి చేసి పట్టుకున్నారు… నలుగురు విద్యార్దుల్లో ఇద్దరు పరారు కాగా, మరో ఇద్దరిని అరెస్ట్ చేసి 1.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబి అధికారుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం గంజాయి నెట్‌వర్క్‌లో విద్యార్థులే కీలక పాత్ర వహిస్తునట్టే తేలడం కలవరం కలిగిస్తొంది.
కర్మ-కర్త-క్రియ విద్యార్థులే..
ఒంగోలులో గంజాయి గుప్పుమంటోంది. కార్మికులు, వ్యసనాలకు బారినపడిన వారితో పాటు అక్కడక్కడ ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు కూడా గంజాయి సేవిస్తున్నారు… ఎస్‌ఈబి అధికారులు గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టి ఓ లాడ్జిపై దాడి చేయడంతో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి… గంజాయి కొనుగోలు, అమ్మకాలు, సరఫరా మొత్తం విద్యార్దులే చేస్తున్నట్టు గుర్తించారు. ఓ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు జట్టుగా ఏర్పడి ఒంగోలులోని ఓ లాడ్జిలో మకాం వేసి గత కొన్నాళ్లుగా గంజాయి అక్రమ దందా చేస్తున్నట్టు గుర్తించారు. నగరంలో ఆసుపత్రులతో బిజీగా ఉండే 60 అడుగుల రోడ్డులోని యలమంద రెసిడెన్సీని ఈ గంజాయి ముఠా వేదికగా చేసుకున్నారు. ఇక్కడ ఒక రూం తీసుకుని అక్కడి నుంచే గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు.
విద్యార్థులే టార్గెట్..
ఒంగోలులోని యలమందా రెసిడెన్సీ లాడ్జిలో గంజాయి విక్రమాలు చేస్తున్నట్టు ఎస్‌ఈబి అధికారులకు పక్కా సమాచారం అందింది. అయితే వీరి దగ్గర కొనుగోలు చేయాలంటే పరిచయం తప్పనిసరి. దీంతో వీరిపై దాడి చేయాలంటే ఎవరో ఒక విద్యార్ధిని పంపించాలి. అలా పంపిస్తే భవిష్యత్తులో ఆ విద్యార్దికి ఇబ్బందులు తప్పవని భావించారు.వెంటనే ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. తమ దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వయస్సు తక్కువ కావడంతో ఆయన్నే ఇంజనీరింగ్ విద్యార్ధి ముసుగులో లాడ్జి దగ్గరకు పంపించారు. అక్కడ గంజాయి అమ్ముతున్నవారిని మాటల్లో పెట్టి తాను ఇంజనీరింగ్ విద్యార్దిగా పరిచయం చేసుకుని ఎలాగోలా పదిగ్రాముల గంజాయిని 500 రూపాయలకు కొనుగోలు చేశారు. తమ అంచనా కరెక్ట్ అని తేలడంతో వెంటనే ఎస్‌ఈబి సిఐ లత ఆద్వర్యంలో సిబ్బంది లాడ్జిపై దాడి చేసి గంజాయి అమ్ముతున్న విజయవాడకు చెందిన దోరేపల్లి పవన్, ఒంగోలుకు చెందిన లాల్ శ్యామ్ లను అరెస్ట్ చేశారు.వీరి దగ్గర నుంచి లక్షా యాభైవేల రూపాయల విలువైన 2.820 కేజీల గంజాయి, బైక్, ఎలక్ట్రానిక్ కాటాను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. విచారణలో నిందితులు తెలిపిన వివరాలు విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. విజయవాడకు చెందిన పవన్, ఒంగోలుకు చెందిన లాల్‌శ్యామ్ ఇద్దరూ ఒంగోలులోని ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజిలో చదివే సమయంలో క్లాస్‌మేట్లుగా ఉన్నారు. వీరిద్దరూ గంజాయికి అలవాటు పడి ఆ తరువాత తామే గంజాయి కొనుగోలు, అమ్మకాలు చేస్తే డబ్బులు సంపాదించవచ్చని ప్లాన్ చేశారు. వీరిలో పవన్ ఒరిస్సాకు వెళ్ళి అక్కడి నుంచి కిలోల చొప్పున గంజాయినీ తీసుకుని ఒంగోలుకు వచ్చేవాడు. ఇక్కడ లాడ్జిలో మకాం వేసి పదిగ్రాములు, ఇరవై గ్రామలు ప్యాకెట్లను ఒక్కొక్కటి 500, వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. అదికూడా కేవలం ఇంటర్ విద్యార్దులు, ఇంజనీరింగ్ విద్యార్ధులు, ఇతర కాలేజిల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే విక్రయిస్తున్నారు. అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. వీరిలో కొంతమందిని పలు డెలివరీ కంపెనీల్లో పార్ట్‌టైం ఉద్యోగులుగా చేర్పించి ఆ ఉద్యోగం చేస్తూనే గంజాయిని కూడా డోర్ డెలివరీ చేస్తున్నట్టు గుర్తించామని ఒంగోలు ఎస్‌ఈబి అధికారి శ్రీధర్ తెలిపారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి…
ఒంగోలులో చాలామంది విద్యార్థులు గంజాయిని సేవిస్తున్నా తల్లిదండ్రులకు సమాచారం లేకపోవడం వెనుక తమ బిడ్డలపై తల్లిదండ్రులకు పర్యవేక్షణ కొరవడటం ఒక కారణంగా కనిపిస్తోంది. గంజాయిని సేవిస్తున్న వారిలోని కొంతమంది ఇంజనీరింగ్విద్యార్థులు గత నాలుగేళ్ళుగా గంజాయి సేవిస్తున్నా తల్లిదండ్రులు కొనుక్కోలేకపోయారని ఎస్‌ఈబి విచారణలో తెలుసుకున్నారు… ఇటీవల ఒంగోలులోని రిమ్స్ మెడికల్ కాలేజిలో కొంతమంది ఎంబిబిఎస్ విద్యార్ధులు గంజాయి, మద్యం మత్తులో కొట్టుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇక్కడ గంజాయి వాడారా లేదా అన్న అనుమానాలు ఉండటంతో ఎస్‌ఈబి అధికారులు ఆ దిశగా ఆలోచించలేదు. తాజాగా పట్టుబడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్దులు ఇచ్చిన సమాచారంతో వీరి దగ్గర ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు. ఒరిస్సాలో వీరికి ఎవరు గంజాయి విక్రయిస్తున్నారన్న విషయాలపై దృష్టిపెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..