Andhra Pradesh: విదేశాల్లో పిల్లలు.. ఒంటరితనంతో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం.. ఆ ఫోన్ కాల్ తో దక్కిన ప్రాణాలు

పిల్లలు ఉద్యోగరీత్యానో.. కుటుంబ పరంగానో.. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి..? వృద్ధాప్యంలో ఒంటరి జీవితం వారిని వేధిస్తుంది. దీంతో చిన్నచిన్న విషయాలకే మనస్థాపానికి గురవుతుంటారు ఆ వృద్ధులు.

Andhra Pradesh: విదేశాల్లో పిల్లలు.. ఒంటరితనంతో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం.. ఆ ఫోన్ కాల్ తో దక్కిన ప్రాణాలు
Visakha Old Cople
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2022 | 11:57 AM

విశాఖ వన్ టౌన్ లో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. అమెరికా నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ తో అలర్ట్ అయిన పోలీసులు.. సకాలంలో  సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. అప్పటికే వృద్ధుడు అపస్మారపు స్థితికి వెళ్ళిపోగా.. వృద్ధురాలు షాక్ లోకి వెళ్లిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. సకాలంలో వైద్యం అందేలా చేసారు. దీంతో వృద్ధ దంపతులు ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసు సేవలను అంతా అభినందించారు. ఇంతకీ ఆ వృద్ధ దంపతులకు వచ్చిన ఆ కష్టం ఏంటి..?! పిల్లలు దూరమై ఒంటరితనమే కారణమా..?

పిల్లలు పెద్దవారై జీవితంలో స్థిరపడాలన్నది ప్రతి తల్లిదండ్రుల కల. రెక్కలు ముక్కలు చేసుకుని చెమటోడ్చి సంపాదించినదంతా.. పిల్లల శ్రేయస్సు కోసమే వినియోగిస్తారు. అందులో భాగంగానే చాలామంది తమ పిల్లలకి చదువులు చదివించి.. మంచి ఉద్యోగాలు పొందెందుకు కారకులవుతారు. మరి కొంతమంది అయితే పిల్లలు ఉన్నత స్థితికి ఎదిగి.. వాళ్ల జీవిత భాగస్వామి కూడా అదే స్థాయిలో ఉండాలని కోరుకుని అటువంటి సంబంధాలు చూస్తూ పెళ్లి చేస్తారు. ఇదంతా సరే..! కానీ పిల్లలు ఉద్యోగరీత్యానో.. కుటుంబ పరంగానో.. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి..? వృద్ధాప్యంలో ఒంటరి జీవితం వారిని వేధిస్తుంది. దీంతో చిన్నచిన్న విషయాలకే మనస్థాపానికి గురవుతుంటారు ఆ వృద్ధులు. ఒక్కో సందర్భంలో తనువు చాలించేందుకైనా వెనుకాడరు. ఎందుకంటే పరిస్థితులు అంతలా ప్రేరేపిస్తాయి వాళ్లకు. ఏమైందో ఏమో కానీ.. విశాఖలో ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ తో అలెర్ట్ అయిన పోలీసులు.. సకాలంలో వెళ్లారు కాబట్టి ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.

విశాఖ వన్ టౌన్ సున్నపు వీధిలో 65 ఏళ్ల సత్యనారాయణ గుప్తా, 62 ఏళ్ల రమణకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. పిల్లల్లో ఒకరు అమెరికాలో… మరొకరు కువైట్లో.. ఇంకొకళ్ళు హైదరాబాదులో ఉన్నారు. విశాఖలో వృద్ధ దంపతులు ఇద్దరు ఒంటరిగానే నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ.. తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. మెడిసిన్స్ ఎక్కువ మోతాదులో మింగారు. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న కూతురు.. విశాఖలోని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుభానికి కాల్ చేశారు. తన పేరెంట్స్ ను కాపాడాలని ఆ ఫోన్ కాల్ లో కోరింది ఆమె. దీంతో వెంటనే అప్రమత్తమైన హెడ్ కానిస్టేబుల్ సుభాని.. వన్ టౌన్ పోలీసులకు అలర్ట్ చేశారు. వన్ టౌన్ పోలీసులతో పాటు వృద్ధ దంపతులో ఉంటున్న ఇంటికి ఎస్బి హెడ్ కానిస్టేబుల్ సుభాని కూడా అడ్రస్ కనుక్కుని వెళ్లారు. ఇంటికి చేరుకునే సరికి అపస్మారక స్థితిలోకి వెళ్లారు సత్యనారాయణ గుప్తా. భార్య రమణకుమారి షాక్ లోకి వెళ్లిపోయింది. సకాలంలో స్పందించి భవనం పై అంతస్తు నుంచి కిందకు దింపిన పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు వృద్ధ దంపతులు. రమణ కుమారి పరిస్థితి మెరుగుపడినప్పటికీ.. సత్యనారాయణ ఇంకా పూర్తిగా తీరుకోలేదు. ఘటన జరిగి 24 గంటల తర్వాత గాని కడుపున పుట్టిన ఎవరు వారి చెంతకు చేరుకోలేదు.

ఇవి కూడా చదవండి

ఒంటరితనంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నరు పోలీసులు. ఇద్దరినీ కౌన్సెలింగ్ చేశామని పోలీసులు ప్రకటన జారీ చేశారు. కాస్త ఆలస్యమైతే దంపతుల ప్రాణాలపైకి వచ్చేది అని అంటున్నారు. పిల్లలు ఎక్కడున్నా.. తల్లితండ్రుల బాగోగుల కంటే ఏది ముఖ్యం కాదని అంటున్నారు వన్ టౌన్ సిఐ రేవతమ్మ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..