Mandous Cyclone: దక్షిణ కోస్తా, రాయలసీమపై పెను ప్రభావం.. స్కూళ్లు మూసివేత.. అధికారులకు సెలవులు రద్దు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ తుపానుగా బలహీనపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలు వెల్లడించింది. తుపానుగా మారిన వాయుగుండం ప్రస్తుతానికి జఫ్నా...

Mandous Cyclone: దక్షిణ కోస్తా, రాయలసీమపై పెను ప్రభావం.. స్కూళ్లు మూసివేత.. అధికారులకు సెలవులు రద్దు..
Mandous Cyclone
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 09, 2022 | 9:27 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ తుపానుగా బలహీనపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలు వెల్లడించింది. తుపానుగా మారిన వాయుగుండం ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 280కిలోమీటర్లు, మహాబలిపురానికి 90 కిలోమీటర్లు, చెన్నైకు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 14కి.మీ వేగంతో కదులుతుందన్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో 65-85 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఆయన వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు (శనివారం) దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.

సముద్రం అలజడిగా ఉంటుందని శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. తుపాను తీరం దాటినప్పటికీ శని, ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాన్ కదలికలను స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. సహాయక చర్యల కోసం ప్రకాశంలో 2, నెల్లూరులో 3, తిరుపతిలో 2, చిత్తూరులో 2 మొత్తం 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ధైర్యంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.

మాండోస్ తుఫాను ప్రభావంపై భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చు. శనివారం కూడా తమిళనాడు, రాయలసీయ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఎగసిపడతాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

నెల్లూరు జిల్లాలో చలిగాలులు వీస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. అన్నమయ్య జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని కలెక్టర్‌ గిరీషా చెప్పారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల దిగువున ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..