Ongole: ఓరే చిరంజీవా.. దుస్తులు విప్పితే విప్పావ్.. 3 తులాల బంగారం చైన్ కూడా..
అతనికో సమస్య ఉంది..? అది తీరాలంటే అధికారుల కాళ్లా వేళ్లా పడాలి. లేదంటే కోర్టుకు వెళ్లాలి. కానీ ఇతను మాత్రం ఇదిగో ఈ పనికి పూనుకున్నాడు. దుస్తులు విప్పేశాడు. దుస్తులు పక్కనబెడితే 3 తులాల గోల్డ్ చైయిన్ కూడా...
ఓర్నీ బండపడ… చొక్కా విప్పితే విప్పావు… 3 తులాల బంగారం చైన్ ఎందుకు విసిరేసావు రా… మద్యం కిక్కు ఎంత పనిచేసింది.. ఒంగోలు కూరగాయల మార్కెట్ దగ్గర వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి దూకుతానంటూ ఓ యువకుడు నానా హంగామా చేశాడు… చొక్కా, ప్యాంటు విప్నేసి అర్థనగ్నంగా నిలబడి తనకు న్యాయం చేయాలని లేకుంటే కిందకు దూకేస్తానని రచ్చ రచ్చ చేశాడు… మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అర్ధంకాని స్థితిలో అంత ఎత్తునుంచి దూకడం అటుంచి ఎక్కడ జారిపడతాడో అని కింద నుంచి వారిస్తున్న బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి… తీరా చూస్తే వాటర్ ట్యాంకర్ ఎక్కింది ఎవరయ్యా… అంటే ఆ పక్కనే కూరగాయాల మార్కెట్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేసుకునే చిరువ్యాపారి చిరంజీవిగా గుర్తించారు… ఓరే చిరంజీవా… దిగిరారా నాయనా… అంటూ ఆయన బంధువులు కిందనుంచి భయంతో కేకలు వేస్తున్నా అతను మాత్రం పట్టించుకోవడం లేదు… మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియడం లేదులా ఉంది… చొక్కా, ప్యాంటు విప్పుతున్నాడు, మళ్ళీ వేసుకుంటున్నాడు… అలా రెండుసార్లు చేశాడు… ఇదేదే ” దూసుకెళ్తా ” సినిమాలో వెన్నల కిషోర్ చీటికి, మాటికి ప్యాంట్ విప్పేసి హంగామా చేయడంలాగే ఉందే.. అనుకుంటూ చూస్తున్న జనం నవ్వుకున్నారు… చివరికి ఒంటిపై బంగారం, సెల్‌ఫోన్ కూడా విసిరేశాడు.
బంగారం చైను, సెల్‌ఫోన్ విసిరేసిన చిరంజీవి…
వాటర్ ట్యాంకర్ ఎక్కి దాదాపు గంటసేపు నానా బీభత్సం సృష్టించిన చిరంజీవి వ్యవహారంతో కూరగాయల మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు, అతని బంధువులు పెద్ద ఎత్తున ట్యాంకర్ దగ్గరకు చేరుకున్నారు… చిరంజీవిని కిందకు దిగి రావాలని బతిమిలాడారు… దీంతో మరింత రెచ్చిపోయిన చిరంజీవి మరోసారి చొక్కా, ప్యాంటు విప్పేశాడు… అంతటితో ఆగకుండా మీ సంగతి తేలుస్తా, నా సమస్యకు పరిష్కారం చూపకుండా కిందకు దిగమంటారా… అంటూ మద్యం మత్తులో 20 వేల విలువైన సెల్‌ఫోన్, మెడలో ఉన్న 3 తులాల బంగారం చైన్ గిరగిరా తిప్పుతూ కిందకు విసిరేశాడు… అవి చిల్లచెట్లలో ఎక్కడపడిపోయాయో తెలియకపోవడంతో ఒకవైపు చిరంజీవిని వారిస్తూనే మరోవైపు బంగారం చైన్ కోసం అతని బంధువులు, స్థానికులు వెతుకులాట ప్రారంభించారు…
ఇంతకీ ఎంటా సమస్య…
చిరంజీవి ఒంగోలు నగరంలోని కూరగాయాల మార్కెట్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు… వేలంపాటలో షాపు ఎక్కడో లోపల రావడంతో ముందు భాగంలో అందరిలా తానుకూడా కొంతస్థలం ఆక్రమించి తడికెలు కట్టుకుని ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటున్నాడు… అయితే ఇటీవల మార్కెట్‌లో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు అక్రమించుకుంటున్నారన్న కారణంగా వాటిని తొలగిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పడంతో మన చిరంజీవి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు… నా షాపు తీసేస్తే ఎలా… నాకు న్యాయం కావాలంటూ ఆదివారం మధ్యాహ్నం తెల్లచొక్కా, తెల్లప్యాంటు ధరించి టిప్పుటాప్‌గా తయారయ్యాడు… లో దుస్తులు కూడా వైట్ అంట్ వైట్ ఉండేలా మెయింటెన్ చేశాడు… ఇక అదే ఊపులో మద్యం దుకాణంలో ఫూటుగా మద్యం సేవించి అదికాస్తా తలకెక్కడంతో వాటర్ ట్యాంక్ ఎక్కాడు… ఇక అక్కడినుంచి గంటపాటు సాగిన నానా బీభత్సం తెలిసిందే… చివరకు బంధువులు కల్పించుకుని చిరంజీవిని వాటర్ ట్యాంకర్‌పై నుంచి కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నంలో తమ తాతలు దిగి వచ్చినంత పనైంది. చిరంజీవి కిందకు దిగి వచ్చినా, అతను విసిరేసిన బంగారం చైన్, సెల్‌ఫోన్ కోసం జనం మాత్రం వెతుకులాట ఇంకా కొనసాగిస్తున్నారు… ఎవడి గోల వాడిదే అంటే ఇదేనేమో.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..