Drone: డ్రోన్ అదృశ్యం.. ఆందోళనలో సిబ్బంది.. 30 మంది రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు
ఇక చేసేదిలేక అదృశ్యం అయిన డ్రోన్ ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని చుట్టుప్రక్కల గ్రామాల్లో చాటింపు వేశారు. అయితే భాగెమ్మపేట పరిధిలో మడ్డువలస రిజర్వాయర్, సూరమ్మకొండ తో పాటు మరో రెండు కొండలు కూడా ఉన్నాయి. డ్రోన్ దారి మల్లి ఆ కొండల పైకి వెళ్లి క్రింద పడిపోయిందా? లేక మడ్డువలస రిజర్వాయర్ లో పడిందా అని అనేక అనుమానాలు రెవెన్యూ సిబ్బందికి వచ్చాయి..
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే కోసం డ్రోన్ లను వినియోగిస్తున్నారు రెవెన్యూ అధికారులు. అందుకోసం అత్యాధునిక పరిజ్ఞానం గల లేటెస్ట్ డ్రోన్ లను కొనుగోలు చేసి మరీ సర్వే నిర్వహిస్తున్నారు. ఒక్కో డ్రోన్ ధర సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల వరకు విలువ ఉంటుంది.అంత ధర వెచ్చించి కొనుగోలు చేసిన హై రెజుల్యూషన్ డ్రోన్ల తో శరవేగంగా భూసర్వే చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఆ డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు శిక్షణ పొందిన ఆపరేటర్స్ సైతం నిరంతరం డ్రోన్లతోనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా డ్రోన్లు సహాయంతో సర్వే జరుపుతున్నారు అధికారులు. అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం వంగర మండలం భాగెమ్మపేట, పట్టువర్ధనం గ్రామాల మధ్య భూముల సర్వే కోసం ఆకాశంలోకి డ్రోన్ ను ఎగురవేశారు అధికారులు.
అయితే అలా సర్వే కోసం వెళ్లిన డ్రోన్ ఎంతసేపు చూసినా తిరిగి క్రిందకి రాలేదు. ఆ క్రమంలోనే డ్రోన్ సిగ్నల్ కూడా కట్ అయ్యింది. దీంతో ఒకింత కంగారు పడిన రెవెన్యూ సిబ్బంది టెక్నికల్ సమస్యతోదారి తప్పి డ్రోన్ ఎక్కడికో వెళ్లిపోయింది అని డిసైడ్ అయ్యారు. సాధారణంగా పైకి వెళ్లిన డ్రోన్ కొన్ని ఛాయాచిత్రాలు తీసి యధావిధిగా గమ్యానికి చేరుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. పైకి వెళ్ళిన డ్రోన్ కొద్దిసేపటికే అదృశ్యమైంది. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెంది డ్రోన్ కోసం వెదకడం ప్రారంభించారు. ముందుగా వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. కానీ రెండు రోజులు వెదికినా డ్రోన్ ఆచూకీ దొరక్కపోవడంతో విషయం బయటకు పొక్కింది.
ఇక చేసేదిలేక అదృశ్యం అయిన డ్రోన్ ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని చుట్టుప్రక్కల గ్రామాల్లో చాటింపు వేశారు. అయితే భాగెమ్మపేట పరిధిలో మడ్డువలస రిజర్వాయర్, సూరమ్మకొండ తో పాటు మరో రెండు కొండలు కూడా ఉన్నాయి. డ్రోన్ దారి మల్లి ఆ కొండల పైకి వెళ్లి క్రింద పడిపోయిందా? లేక మడ్డువలస రిజర్వాయర్ లో పడిందా అని అనేక అనుమానాలు రెవెన్యూ సిబ్బందికి వచ్చాయి. ఏదో ఒకలా డ్రోన్ ఆచూకీ కనుగొనాలని సుమారు ముప్పై మంది సిబ్బంది నాలుగు రోజుల పాటు మూడు కొండలు ఎక్కి వెదకడం ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేదు. సహజంగా డ్రోన్ సిగ్నల్, బ్యాటరీ లను ఆపరేటర్స్ ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పరిశీలించాలి. డ్రోన్ సిగ్నల్ సుమారు ఐదు కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఆపరేటర్స్ డ్రోన్ వదిలిన దగ్గర నుండి సూరమ్మకొండ, మడ్డువలస రిజర్వాయర్స్ కేవలం రెండు కిలోమీటర్లు మేర మాత్రమే ఉన్నాయి. ఒకవేళ కొండ మీద పడి ఉంటే ఖచ్చితంగా డ్రోన్ సిగ్నల్ వస్తుంది.
అదే మడ్డువలస రిజర్వాయర్ లో పడితే మాత్రం ఖచ్చితంగా సిగ్నల్ కట్ అవుతుంది. ఇక రిజర్వాయర్ లో సైతం జాలర్లతో వెదికినా ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ఇదెక్కడి భాధరా నాయన అని తలలు పట్టుకుంటున్నారు రెవెన్యూ సిబ్బంది. సుమారు ముప్పై మంది సిబ్బంది నాలుగు రోజులుగా ముఖ్యమైన రెవెన్యూ పనులు అన్నీ ప్రక్కనపెట్టి మరీ వెదుకుతున్నా ఆచూకీ లభ్యం కావట్లేదు. గాల్లోకి ఎగిరిన డ్రోన్ కొండ పైన పడిందా? మడ్డువలస రిజర్వాయర్ లో పడిందా? లేక ఎవరైనా సైబర్ ఆగంతుకులు డ్రోన్ ను దారి మళ్లించి కాజేశారా? అనే అనేక అనుమానాలు అందరినీ కలిచివేసున్నాయి. ఏదిఏమైనా ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు డ్రోన్ మిస్సింగ్ వ్యవహారం రెవెన్యూ సిబ్బంది అగచాట్లుకు వచ్చి పడినట్లు అయ్యింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి