AP News: ఎటూ తేలని ‘పొత్తుల’ పంచాయితీ.. టీడీపీ ఆఫర్ కంటే ఎక్కువే కోరుతున్న బీజేపీ, జనసేన.!
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్దుబాటు అంశం కీలకదశకు చేరుకుంది. నిన్న బీజేపీ పెద్దలతో చంద్రబాబు జరిపిన చర్చల ప్రతిపాదనలను ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్ ముందు ఉంచే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి, జనసేనకు కలిపి తాను 30 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంటు సీట్లు ఇవ్వగలనని కమలనాథులకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్దుబాటు అంశం కీలకదశకు చేరుకుంది. నిన్న బీజేపీ పెద్దలతో చంద్రబాబు జరిపిన చర్చల ప్రతిపాదనలను ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్ ముందు ఉంచే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి, జనసేనకు కలిపి తాను 30 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంటు సీట్లు ఇవ్వగలనని కమలనాథులకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపైనే పవన్ కల్యాణ్‌తో బీజేపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు-పవన్ మధ్య సీట్ల సర్దుబాటుపై అమరావతిలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనలపై పవన్ కల్యాణ్ ఏం చెబుతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇవాళ్టి చర్చల వివరాలను బీజేపీ నేతలకు చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. అయితే టీడీపీ ఆఫర్ చేసిన సీట్లకంటే ఎక్కువ జనసేన, బీజేపీ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూడు పార్టీల చర్చల్లో భాగంగానే మరొక ప్రతిపాదన కూడా తెరమీదకు వస్తున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. పవన్ కల్యాణ్‌ను పార్లమెంటుకు పోటీచేయించాలనేది ఈ చర్చల్లోని ఒక ఆప్షన్ అని తెలుస్తోంది. ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్‌తో చర్చల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఆ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. ఆమెతో ఈ విషయాలు చర్చించి, పొత్తులు, అందులోభాగంగా సీట్ల సర్దుబాటును బీజేపీ పెద్దలు ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నిన్న అమిత్‌షాతో పొత్తు చర్చల తర్వాత ఢిల్లీలో కీలక భేటీలు జరుగుతున్నాయ్. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు చంద్రబాబు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మరోసారి బాబుతో సమావేశమయ్యారు. అలాగే, మాజీ మంత్రి నారాయణ కూడా చంద్రబాబును కలిశారు. శ్రీకృష్ణదేవరాయలు, నారాయణ ఒకే వాహనంలో గల్లా జయదేవ్ ఇంటికి రావడం ఆసక్తికరంగా మారింది.