AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి అలజడి.. రోడ్డెక్కిన 1200 మంది పోలీసులు.. కట్ చేస్తే.. కళ్లు చెదిరే.!

ఎన్నికల సీజన్ దగ్గరపడడంతో పొలిటికల్ హీట్ మొదలైంది. నేతల పర్యటనలు, నాయకుల హడావుడి పెరిగింది. అధికారులు కూడా ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. దీంతో ఇక విశాఖ పోలీసులు ఒక్కసారిగా యాక్షన్ ప్లాన్‌తో పని ప్రారంభించారు. ఆకస్మిక తనిఖీలకు తెరలేపారు.

అర్ధరాత్రి అలజడి.. రోడ్డెక్కిన 1200 మంది పోలీసులు.. కట్ చేస్తే.. కళ్లు చెదిరే.!
Vizag News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 08, 2024 | 12:18 PM

Share

ఎన్నికల సీజన్ దగ్గరపడడంతో పొలిటికల్ హీట్ మొదలైంది. నేతల పర్యటనలు, నాయకుల హడావుడి పెరిగింది. అధికారులు కూడా ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. దీంతో ఇక విశాఖ పోలీసులు ఒక్కసారిగా యాక్షన్ ప్లాన్‌తో పని ప్రారంభించారు. ఆకస్మిక తనిఖీలకు తెరలేపారు. నగరంలో నాకాబందీతో భారీగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున బంగారం, వెండి, నగదును పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే సాధారణ ఎన్నికల దృష్ట్యా అడిషనల్ డి.జి.పి, విశాఖ సిపి, అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ రవిశంకర్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటి నుంచే అక్రమార్కులు, చట్ట వ్యతిరేకుల ఆటపట్టించేందుకు పని ప్రారంభించేశారు. ఇందులో భాగంగా జాయింట్ సి.పి ఫకీరప్ప ఆధ్వర్యంలో విశాఖ నగరమంతా నాకాబంధీ నిర్వహించారు. రాత్రి నగరవ్యాప్తంగా దాదాపు 1200 మంది పోలీసు సిబ్బంది, అధికారులు రోడ్లపైకి వచ్చారు. 110 బృందాలుగా ఏర్పడి నాకాబందీ చేశారు. నగరమంతా జల్లెడ పట్టారు. అక్రమ మద్యం, నగదు, ఇతర అసాంఘిక, అనుమానిత వస్తువులను నివారించేలా ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను, నగదు, బంగారం, వెండి, అక్రమ మద్యం, బియ్యం వంటి వాటిని సీజ్ చేశారు.

నాకాబందీలో కళ్లుచెదిరేలా.. నగదు, బంగారం, వెండి.. ఎక్కడెక్కడంటే.?

నగరంలో మొత్తం 14,220 వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 663 వాహనాలు సీజ్ చేశారు. పీనగాడి జంక్షన్ వద్ద ఒక వ్యక్తిని అరెస్టు చేసి, 10 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. శనివాడ జంక్షన్ వద్ద తనిఖీల్లో 14.47 కేజీల బంగారం, 13.31 కేజీల వెండి స్వాధీనం చేసుకుని.. పత్రాలను వెరిఫై చేస్తున్నారు. కాకినాడ విశాఖ వస్తున్న నుంచి లాజిస్టిక్ వాహనంలో.. బంగారం వెండి గుర్తించారు. ఇక.. రైల్వే స్టేషన్ సమీపంలో 4.5 లక్షల నగదు, ఆరు మద్యం సీసాలు, మద్దిలపాలెం జంక్షన్ వద్ద 4.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్ వద్ద ఒక వ్యక్తిని అరెస్టు చేసి, సుమారు 860 కేజీల(18 బస్తాలు) బియ్యం ను, ఒక ఆటోను సీజ్ చేశారు.

సెబ్(SEB) తనిఖీల్లో..

ఇదిలా ఉంటే.. ఆరో తేదీన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో.. ఒకరిని అరెస్టు చేసి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా మధ్యం కలిగి ఉన్నందుకు.. 8 మందిపై కేసులు నమోదు చేసి 21.22 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న 5.97 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోర్త్ టౌన్ పోలీసులకు.. అప్పగించారు. తనిఖీల్లో సీజ్ చేసిన పై అన్నింటికీ విచారణ జరిపి.. చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద మొత్తంలో నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను తీసుకువెళుతున్నట్లయితే.. కచ్చితంగా తగిన ధ్రువపత్రాలు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. లేకుంటే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.