Pithapuram: పవన్ పోటీపై భగ్గుమన్న విబేధాలు.. పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళన

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అనేక మంది తమ పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే వర్మ భావోద్వేగానికి గురై కంటతడి కూడా పెట్టారు.

Pithapuram: పవన్ పోటీపై భగ్గుమన్న విబేధాలు.. పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళన
Ex Mla Pithapuram Svsn Varma
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 08, 2024 | 9:05 AM

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అనేక మంది తమ పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే వర్మ భావోద్వేగానికి గురై కంటతడి కూడా పెట్టారు.

రాజులకు ఆస్థానంగా పేరుగాంచిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కన్‌ఫమ్‌గా పోటీ చేస్తారనే ప్రచారంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పిఠాపురం టీడీపీ ఆఫీస్ దగ్గర హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ పాంప్లేట్స్ తగలబెట్టారు. ఇప్పటికే పలువురు నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. వర్మకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే 2014లో మాదిరిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామన్నారు టీడీపీ కార్యకర్తలు.

ఆందోళన చేస్తున్న కార్యకర్తలను సముదాయించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. చంద్రబాబుపై నమ్మకం ఉందని, ఎవరూ తొందరపడొద్దన్నారాయన. పిఠాపురం టికెట్ తనకే వస్తుందన్న ధీమా ఉన్నప్పటికీ టీడీపీ అధిష్టానం నుంచి నో అనే సంకేతాలు రావడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్యాభర్తలిద్దరూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం వర్మ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు.

పిఠాపురం టికెట్‌ వర్మకే ఇవ్వాలంటూ టీడీపీ నేతలు రెండు మూడు రోజులుగా అత్యవసర సమావేశాలు పెట్టుకున్నారు. ఏ రోజూ రాజకీయ వేదికలపైకి రాని వర్మ భార్య కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వర్మ మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు సూచిస్తున్నారు. అయితే పిఠాపురం టికెట్‌ తనకే దక్కుతుందని వర్మ విశ్వాసంగా ఉన్నారు.

పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 90 వేలకు పైగా ఉన్నాయి. దీంతో పవన్‌ సునాయాసంగా ఇక్కడ గెలుస్తారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హస్తినలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ హై కమాండ్‌తో పవన్‌, చంద్రబాబు జరిపిన చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీట్ల పంపకంపైనా ఏకాభిప్రాయం వెలువడలేదు. ఇప్పటికే టీడీపీ జనసేన కలిపి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనే క్లారిటీ ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో పొత్తులు, సీట్ల పంపకంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే పవన్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌ వీడుతుంది. అప్పటివరకూ పిఠాపురంలో టీడీపీ-జనసేన నేతల మధ్య అలజడి కొనసాగే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…