Dhulipalla narendra: ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కరోనా పాజిటివ్.. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కరోనా పాజిటివ్ తేలింది. ఆయనతోపాటు సహకార శాఖ మాజీ అధికారి గురునాథానికి....
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కరోనా పాజిటివ్ తేలింది. ఆయనతోపాటు సహకార శాఖ మాజీ అధికారి గురునాథానికి హైకోర్టు ఆదేశాల మేరకు సి.టి.స్కాన్ తీయించగా ఇద్దరికీ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇద్దరి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఇద్దరినీ విజయవాడ ఆయు ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కొవిడ్ పరీక్షలు చేయించాలని ఏసీబీ దర్యాప్తు అధికారిని, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. పరీక్షల్లో వారికి కొవిడ్ సోకిందని తేలితే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని చెప్పింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పిటిషనర్ల బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరపడానికి హైకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ అడ్డంకి కాదని తెలిపింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఏసీబీ అధికారులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణ వ్యాజ్యం దాఖలు చేశారు. కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతిస్తూ.. పిటిషనర్లు వ్యక్తిగతంగా ఏ విధంగా లబ్ధి పొందారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణకు వచ్చింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.. కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని ఏసీబీ న్యాయవాది వాదనలు వినిపించారు.
Also Read: తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు.. అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు ఇవే