AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Fengal: నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. పుదుచ్చేరికి రెడ్‌ అలర్ట్‌.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుకు తుఫాన్ గండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం ఈ రోజు తుఫాన్‌గా మారనుంది. దీంతో తమిళనాడు పుదుచ్చేరికి రెడ్‌ అలర్ట్‌.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తమిళనాడులోని మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.

Cyclone Fengal: నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. పుదుచ్చేరికి రెడ్‌ అలర్ట్‌.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ
Cyclone Fengal
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2024 | 6:28 AM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 770 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. నేడు తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ఫెంగల్‌గా నామకరణం చేశారు అధికారులు. పుదుచ్చేరి-చెన్నై మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.

తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇప్పటికే తీవ్రవాయుగుండం ప్రభావంతో నాగపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాన్ ప్రభావం ఏపీపైనా పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రాగల 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశముంది. రాగల 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్నిజిల్లాల కలెక్టర్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..