AP DSC 2024 New Syllabus: టీచర్ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీ కొత్త సిలబస్ వచ్చేసింది! డైరెక్ట్ లింక్ ఇదే
మెగా డీఎస్సీ 2024కి సంబంధించి ఏపీ విద్యాశాఖ నేడు కొత్త సిలబస్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సిలబస్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది..
అమరావతి, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. ఇప్పటికే కొన్ని కారణాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా సన్నద్ధత కొనసాగించాలని ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా డీఎస్సీ సిలబస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో డీఎస్సీ సిలబస్ నవంబర్ 27 (బుధవారం)వ తేదీన విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. నవంబర్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు మెగా డీఎస్సీ సిలబస్ విడుదల చేసినట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. అభ్యర్థులు మెగా డిఎస్సి సిలబస్ ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం!
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాకే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకు కనీసం 2,3 నెలల సమయం పడుతుందని ఇప్పటికే చెప్పింది. అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై మాత్రం అధికారికంగా స్పష్టత లేదు. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ 2, 3 నెలలపాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతోంది.
ఏపీ మెగా డీఎస్సీ 2024 కొత్త సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు లోకేష్ అసెంబ్లీలో చెప్పారు కూడా. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు, నియమకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు.