Private Hospitals: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. అవకతవకలకు పాల్పడుతూ.. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా 9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి 15 ఆసుపత్రులను తనిఖీ చేసి 9 ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. దీంతో ఆ తొమ్మిది ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కొవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మంగళ, బుధవారాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 37 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయని తెలిపారు. దీంతోపాటు రెమిడెసివర్ ఇంజెక్షన్లు దుర్వినియోగం చేయడం, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం , ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా చికిత్స చేయడం, ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన రోగులకు కరోనా చికిత్సను తిరస్కరిస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించడం జరిగిందని ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు.
Also Read: