AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్ కాబోతున్నారా? పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

YS Sharmila: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఏపీలోని ఆ పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం రేపుతోంది. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆ దేశగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏపీలో పర్యటించనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Andhra Pradesh: వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్ కాబోతున్నారా? పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Ys Sharmila
Janardhan Veluru
|

Updated on: Dec 10, 2023 | 3:11 PM

Share

తెలంగాణలో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఏపీలోని ఆ పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నింపుతోంది. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆ దేశగా పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏపీలో పర్యటించనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఏపీ కాంగ్రెస్‌లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వచ్చే అవకాశం ఉందని.. ఆమె వస్తే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఆహ్వానిస్తుందని అన్నారు. అలాగే త్వరలో ఏపీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఉంటుందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు రాహుల్ గాంధీ త్వరలోనే విశాఖపట్నం రానున్నట్లు తెలిపారు. అలాగే అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు ప్రియాంక గాంధీ త్వరలో వస్తారని తెలిపారు.

కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో రాబోయే వంద రోజుల్లో నిశ్శబ్ద విప్లవం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో పెను మార్పులు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో జమిలి ఎన్నికలు వచ్చే ఏప్రిల్ నెలలో జరగాల్సి ఉంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోకవర్గాలతో పాటు 25 లోక్‌సభ నియోకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ఇప్పటికే ఆ పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ తన వైఖరిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.  ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తామని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని , రాష్ట్రంలో పూర్వ వైభవం చాటాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..