Congress Party: నిన్న ఎలక్షన్ కమిటీ.. నేడు కోఆర్డినేటర్లు.. ఎన్నికల కోసం వేగంగా కాంగ్రెస్ అడుగులు
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పదేళ్లుగా అధికారానికి దూరమైన ఆ పార్టీ.. ఈసారి ఎలాగైనా గెలుపొంది తీరాలన్న పట్టుదలతో ఉంది. నానాటికీ బలోపేతమవుతూ ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఈసారి ఎలాగైనా బ్రేకులు వేయాలని చూస్తోంది. ఇప్పటికే సుమారు 30 పార్టీలతో జట్టు కట్టి భారీ విపక్ష కూటమి (I.N.D.I.A)ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సంస్థాగతంగానూ సిద్ధం చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పదేళ్లుగా అధికారానికి దూరమైన ఆ పార్టీ.. ఈసారి ఎలాగైనా గెలుపొంది తీరాలన్న పట్టుదలతో ఉంది. నానాటికీ బలోపేతమవుతూ ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఈసారి ఎలాగైనా బ్రేకులు వేయాలని చూస్తోంది. ఇప్పటికే సుమారు 30 పార్టీలతో జట్టు కట్టి భారీ విపక్ష కూటమి (I.N.D.I.A)ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సంస్థాగతంగానూ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోగానే వీలైనంత మంది అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేసి, ప్రకటించాలని చూస్తోంది. తద్వారా సదరు అభ్యర్థికి ప్రచారానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. కొన్ని రాష్ట్రాలో అభ్యర్థులను షెడ్యూల్ కంటే ముందే ప్రకటించిన చోట్ల గెలుపు అవకాశాలు పెరిగాయని గుర్తించింది.
అందుకే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా రాజకీయ కార్యాకలాపాలను వేగవంతం చేస్తోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను ప్రకటించిన కాంగ్రెస్, తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్లను ప్రకటించింది. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు వీలవుతుందని భావిస్తోంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును చేపడుతుంది. తొలిదశలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గానికి ముగ్గురేసి ఆశావహుల పేర్లతో జాబితా తయారు చేసే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలను లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలు, అభ్యర్థుల ఆర్థిక, సామాజిక బలాబలాలను బేరీజు వేసుకుంటూ గెలుపు అవకాశాలకే పెద్దపీట వేస్తూ ఈ కసరత్తు నిర్వహించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, అభ్యర్థులను ఎంపిక కసరత్తు పూర్తిచేసి పేర్లను ప్రకటించేలోగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించి, వారికి బాధ్యతలు అప్పగించింది. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలను అమలు చేసే విషయంలో కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన కోఆర్డినేటర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గంలోని మరికొందరు నేతలు, పార్టీ సీనియర్ నేతలున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిలకు కాంగ్రెస్ అధిష్టానం రెండేసి నియోజకవర్గాల బాధ్యతల్ని అప్పగించింది.
తెలంగాణ కోఆర్డినేటర్ల జాబితా:
1 ఆదిలాబాద్ (ST) – డి. అనసూయ (సీతక్క) 2 పెద్దపల్లి (SC) – డి. శ్రీధర్ బాబు 3 కరీంనగర్ – -పొన్నం ప్రభాకర్ 4 నిజామాబాద్ – టి.జీవన్ రెడ్డి 5 జహీరాబాద్ – పి.సుదర్శన్ రెడ్డి 6 మెదక్ – దామోదర రాజనరసింహ 7 మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు 8 సికింద్రాబాద్ – భట్టి విక్రమార్క మల్లు 9 హైదరాబాద్ – భట్టి విక్రమార్క మల్లు 10 చేవెళ్ల – ఎ. రేవంత్ రెడ్డి 11 మహబూబ్ నగర్ – ఎ. రేవంత్ రెడ్డి 12 నాగర్ కర్నూల్ (SC) – జూపల్లి కృష్ణారావు 13 నల్గొండ – ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి 14 భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 15 వరంగల్ (SC) – కొండా సురేఖ 16 మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 17 ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంసిద్ధతను చాటుకుంటోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. విపక్ష కూటమి (INDIA)లో భాగంగా ఉన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)తో మినహా ఏపీలోని ఏ ఇతర ప్రధాన రాజకీయ పార్టీతో తమకు పొత్తు ఉండదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ స్పష్టం చేశారు. ట్విట్టర్ (X)లో ఆయన చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మత విద్వేషం ప్రదర్శించే బీజేపీతో తాము రాజీలేని పోరాటం చేస్తామని అందులో పేర్కొన్నారు. అలాగే బీజేపీతో తెలుగుదేశం, జనసేన పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయని, ఆ రెండు పార్టీలకు కూడా తాము వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. మరోవైపు బీజేపీతో వైఎస్సార్సీపీ అక్రమ, అనైతిక బంధాన్ని కొనసాగిస్తోందని ఆరోపిస్తూ.. ఆ పార్టీపైనా పోరాటం చేస్తామని వెల్లడించారు. మొత్తంగా ఏపీలోనాలుగు పార్టీలు (బీజేపీ, తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ)కు వ్యతిరేకంగా I.N.D.I.A కూటమి పార్టీలతో కలిసి పోరాడతామని ట్వీట్ చేశారు.
We fight the BJP with zero tolerance due to communal hatred. Congress takes on TDP and Jana Sena,partners of the BJP. Jagan's party has an illicit relationship with the BJP. Andhra Congress will fight all four parties. We stand with INDIA partners.#TDPJaganPawanBTeamofBJP pic.twitter.com/usDHnniJeU
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) January 7, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను అధిష్టానం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో అటు లోక్‌సభతో పాటు ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశమంతటా ఎదురుగాలి వీచినప్పుడు సైతం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగునేలపై తమ పూర్వవైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ల జాబితా:
1 అరకు – (ఎస్టీ) జగతా శ్రీనివాస్ 2 శ్రీకాకుళం – మీసాల సుబ్బన్న 3 విజయనగరం – బొడ్డేపల్లి సత్యవతి 4 విశాఖపట్నం – కొత్తూరి శ్రీనివాస్ 5 అనకాపల్లి – సనపాల అన్నాజీరావు 6 కాకినాడ – కే.బీ.ఆర్. నాయుడు 7 అమలాపురం – (ఎస్సీ) ఎం. వెంకట శివ ప్రసాద్ 8 రాజమండ్రి – ముషిని రామకృష్ణ 9 నరసాపురం – జెట్టి గురునాధరావు 10 ఏలూరు – కనుమూరి బాపి రాజు 11 మచిలీపట్నం – కొరివి వినయ్ కుమార్ 12 విజయవాడ – డి.మురళీ మోహన్ రావు 13 గుంటూరు – గంగిశెట్టి ఉమాశంకర్ 14 నరసరావుపేట – వి.గురునాధం 15 బాపట్ల – (ఎస్సీ) శ్రీపతి ప్రకాశం 16 ఒంగోలు – యు.వెంకటరావు యాదవ్ 17 నంద్యాల – బండి జకారియా 18 కర్నూలు – పి.ఎం. కమలమ్మ 19 అనంతపురం – ఎన్ శ్రీహరి ప్రసాద్ 20 హిందూపూర్ – షేక్ సత్తార్ 21 కడప – ఎం. సుధాకర్ బాబు 22 నెల్లూరు – ఎం.రాజేశ్వరరావు 23 తిరుపతి (ఎస్సీ) – షేక్ నాజర్ అహమ్మద్ 24 రాజంపేట – డా. ఎన్. తులసి రెడ్డి 25 చిత్తూరు – (ఎస్సీ) డి. రాంభూపాల్ రెడ్డి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..