Konaseema District: లంక గ్రామాలకు సీఎం జగన్ వరాలు.. ఆ విషయంలో వెనకడుగు వేయొద్దంటూ కలెక్టర్లకు ఆదేశాలు..
Ambedkar Konaseema District: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్, స్థానిక గ్రామాల్లో కాలినడనక తిరుగుతూ.. వరద నష్టం, సహాయక చర్యలపై ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి గడప వద్దకూ వెళ్లి వరద సహాయంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ విజ్ఞప్తులను స్వీకరించారు. తన పర్యటన కొనసాగిస్తున్న క్రమంలో సీఎం జగన్ కూనలంక, లంకా ఆఫ్ ఠాణేలంక, కొండుకుదురులో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు 8: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. ఈ క్రమంలోనే త్వరంలో రక్షణ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ముమ్ముడివరం మండలంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్, స్థానిక గ్రామాల్లో కాలినడనక తిరుగుతూ.. వరద నష్టం, సహాయక చర్యలపై ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి గడప వద్దకూ వెళ్లి వరద సహాయంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ విజ్ఞప్తులను స్వీకరించారు. తన పర్యటన కొనసాగిస్తున్న క్రమంలో సీఎం జగన్ కూనలంక, లంకా ఆఫ్ ఠాణేలంక, కొండుకుదురులో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ‘రైతులకు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’నని పేర్కొన్నారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురజపులంక, కూనలంక గ్రామాల్లో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని కోరారు. గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఇలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చామని, వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించామని చెప్పారు. తానే స్వయంగా వచ్చి వరద బాధితులను కలుస్తానని చెప్పానని, రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నానని సీఎం పేర్కొన్నారు.
పంట నష్టం వివరాలు ఆర్‌బీకే రికార్డుల్లో..
పేదలకు సహాయం అందించే విషయంలో వెనుకడుగు వేయకూడదని, తక్కువ డ్యామేజీ జరిగినా రూ.10 వేలు ఇవ్వాల్సిందేనని కలెక్టర్లను ఆదేశించినట్లు సీఎం వివరించారు. ప్రతి గ్రామంలో విలేజీ క్లినిక్‌తో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్‌బీకేల్లో పొందుపరుస్తామన్నారు. ఎవరి పేరు అయినా మిస్ అయితే ఆర్‌బీకేల్లో ఫిర్యాదు చేయండని సూచించారు.
రూ.150 కోట్లతో లంక గ్రామాల్లో రక్షణ గోడ నిర్మాణం
లంక గ్రామాల ప్రజలను వరద ముప్పు నుంచి రక్షించేందుకు రూ.150 కోట్లతో రివెట్‌మెంట్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజినీర్లను సీఎం జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య మార్పును గమనించాలని సీఎం కోరారు. ఈ నాలుగేళ్లలో ఇటువంటి ఏ ఘటన జరిగినా కూడా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చి వారి చేతుల్లో డబ్బులు పెట్టానని,. గతంలో లేని గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకువచ్చానని అన్నారు. కలెక్టర్లకు, అధికారులకు సమయం ఇచ్చి ప్రతి గ్రామంలో యాక్టివేట్ చేశానని చెప్పారు. ‘నష్టపోయిన ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, నాకు సహాయం అందలేదన్న మాట రాకూడదన నేనే వస్తాను. గ్రామాల్లో ఏ ఒక్కరూ కూడా మా కలెక్టర్ సరిగ్గా పని చేయకూడదన్న మాట వినపడకూడదని చెప్పాను. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా మాకు సహాయం అందింది నిత్యావసరాలు అందించారని అధికారులు బాగా పని చేస్తున్నారని చెబుతున్నారు’ అని సీఎం జగన్ చెప్పారు.