Chandra Babu: నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు.. అధికారుల నిర్ణయంపై భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు..
Chandra Babu: ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానికంగా ఉండే రైతులు, నేతలతో కలసి ఆయా ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోలవరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ మేరకు.. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం అనుమతి కోరుతూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు చంద్రబాబు ప్రైవేట్ సెక్రటరీ..
Chandra Babu: అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కాలం ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రగడ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల సభలు, సమావేశాలు రసవత్తర రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానికంగా ఉండే రైతులు, నేతలతో కలసి ఆయా ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోలవరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ మేరకు.. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం అనుమతి కోరుతూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు చంద్రబాబు ప్రైవేట్ సెక్రటరీ కృష్ణ కపర్ది. ఈ లేఖ వ్యవహారమే ఇప్పుడు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
చంద్రబాబు టీమ్ లేఖపై రిప్లై ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు.. ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితి, కొనసాగుతున్న పనుల దృష్ట్యా 14 మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. పీపీఏ, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ప్రాజెక్టు వద్ద 24 గంటల రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు పరివాహక, దిగువ ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టు వద్ద హెవీ మెషినరీతో పనులు కొనసాగుతున్నందున కాన్వాయ్ వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని, ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ సేఫ్టీ దృష్ట్యా చంద్రబాబుతో పాటు 14 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని సీఈ సుధాకర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు 14 మంది జాబితాను ఐడెంటిటీ ప్రూఫ్‌లతో సంబంధిత జిల్లా అధికారులకు ఇవ్వాలని సీఈ సుధాకర్ బాబు తన లేఖ ద్వారా కోరారు.
ఇదిలాఉంటే.. పోలవరం ప్రాజెక్టు సందర్శనపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పరిమితులు విధించడాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఇక.. రాష్ట్రంలోని నీటిసాగు ప్రాజెక్టులను వరుసగా సందర్శిస్తూ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వమే టార్గెట్ అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు.. సోమవారాన్ని పోలవారంగా మార్చారు. తన ఐదేళ్ల పాలనలో ఆయన ఏకంగా 28 సార్లు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఇక ఈ రోజు సోమవారం కావడంతో.. విపక్షనేతగా పోలవరం వెళ్లాలని భావిస్తున్నారు చంద్రబాబు. మొత్తంగా.. చంద్రబాబు పోలవరం టూర్ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది.