Lord Balaji: సీఎం రివ్యూలో శ్రీవారి ఏకాంత సేవపై ప్రధానంగా చర్చ
తిరుమల అభివృద్ధి, భక్తుల రద్దీ, భవిష్యత్తులో చేపట్టబోయే చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు వేర్వేలు సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా రివ్యూలో చర్చించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం రివ్యూలో శ్రీవారి ఏకాంత సేవపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఏకాంత సేవ సమయం రోజురోజుకి తగ్గిపోతుందని.. దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లింది టీటీడీ.
క్షణం తీరిక లేకుండా ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చే శ్రీవారికి అర్ధరాత్రి ఒంటి గంటకు పవళింపు సేవ చేస్తారు. దీనినే ఏకాంత సేవ అని కూడా అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేసి పాలు, పళ్లు, బాదం పప్పు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెల్లో ఉంచుతారు.
ఏడుకొండలవాడిని నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. ఇది తాళ్లపాకవారి లాలిగా ప్రసిద్ది పొందింది. ఈ ఏకాంత సేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగ శ్రీనివాసుడికి.. ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి చేస్తారు. ఏకాంత సేవతో ఆ రోజు చేసే పూజలన్నీ ముగుస్తాయి. రాత్రి ఒంటి గంటకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందు మూడో ద్వారాన్ని.. ఆ తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపలి గడియలు వేస్తారు. బయటివైపు తాళాలు వేసి వాటిపై సీలు వేసే సంప్రదాయం అనాదిగా వస్తోంది.
శ్రీవారి ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని కోరుతున్నారు అర్చకులు. 23 గంటల పాటు శ్రీవారి దర్శనాలు కొనసాగడం సరికాదంటున్నారు. గర్భాలయంలోని మూలమూర్తికి కనీసం గంట నుంచి గంటన్నరసేపైనా ఏకాంతం కల్పించాలంటున్నారు. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడ్ని ఆరాధిస్తారని.. స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని చెబుతున్నారు. కొన్ని రోజుల్లో అయితే 7,8 నిమిషాలు మాత్రమే ఏకాంత సమయం కేటాయిస్తున్నారని.. ఈ పద్దతి మారాలంటున్నారు అర్చకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
