Andhra Pradesh: “కొత్తవి ఎలాగూ కట్టరు.. ఉన్న వాటినీ పట్టించుకోరా”.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..
అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచడంపై..
అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రయాణీకుల సంక్షేమంపై లేదా అని ప్రశ్నించారు. పై కప్పు పెచ్చులూడి మహిళ తలపై పడి తీవ్ర గాయాలైన ఘటనపై ట్విటర్లో స్పందించారు. ఆర్టీసీ బస్సు ఎక్కితే చక్రాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలీదని, బస్సులో ఉన్నా గొడుగులు పట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోందని మండి పడ్డారు. గుత్తి ఆర్టీసీ బస్టాండ్‍లో పైకప్పు పెచ్చులూడి, బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంపై విచారం వ్యక్తం చేశారు. కొత్త నిర్మాణాలు కట్టకపోగా.. ఉన్న వాటినే సరిగా చూసుకోలేరా అని నిలదీశారు. ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం కల్పించే బాధ్యత ఇదేనా అని ప్రభుత్వానికి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
కాగా.. గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో పై కప్పు పెచ్చులు ఊడి పడి ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చెందిన సుధా అనే మహిళ స్వగ్రామానికి వెళ్లేందుకు గుత్తి బస్టాండ్ కు చేరుకున్నారు. స్థానిక బస్టాండ్ లో బస్సు కోసం వేచి ఉన్నారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి బస్టాండులో కూర్చొని ఉండగా పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో సుధా, లక్ష్మీదేవి లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే దాదాపు 50 మంది ప్రయాణికులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
గతంలో నిర్మించిన బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. బస్టాండ్ భవనానికి మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.