CBN Arrest: బాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ సైలెంట్, తెలంగాణ బీజేపీ వయొలెంట్.. రీజన్ ఏంటి..?
ఒక పార్టీ ఒకే అంశంపై రెండు రకాల ఆదేశాలు ఇస్తుందా? బాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ సైలెంట్, తెలంగాణ బీజేపీ వయొలెంట్. అక్కడ మాట్లాడొద్దని చెప్పి, ఇక్కడి వాళ్లకి పర్మిషన్ ఏమైనా ఇచ్చిందా అని డౌట్. లేదంటే.. బీఆర్‌ఎస్ సైలెంట్‌గా ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని తెలంగాణ బీజేపీ ఉపయోగించుకుంటోందా? బాబు అరెస్ట్‌పై మాట్లాడితే వచ్చే లాభమేంటి? సైలెంట్‌గా ఉంటే వచ్చే నష్టమేంటి?
తెలంగాణ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఇంపాక్ట్ ఎంత? నాయకులు మాట్లాడినా, మాట్లాడకపోయినా.. ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ వైపు ఉన్నవాళ్లే.. మారిన పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓటర్లుగా షిఫ్ట్ అయ్యారన్నది నిజం. అలాంటప్పుడు పార్టీలు ఏమనుకుంటున్నాయన్నది.. షిఫ్ట్ అయిన ఓటర్లకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఏపీ రాజకీయాల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కమ్మ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇక నల్లగొండ జిల్లాలోని ఏపీ సరిహద్దు నియోజకవర్గాల్లోనూ కచ్చితమైన ప్రభావం ఉంటుంది. కోదాడ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ లాంటి ఏరియాలు, నిజామాబాద్ రూరల్, బాల్కొండ లాంటి ప్రాంతాల్లో టీడీపీకి ఓటర్లు ఉన్నారు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో ఏపీ ఓటర్లు ఉన్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పడిన ఓట్లలో మెజారిటీ ఆంధ్ర ప్రాంత ఓటర్లవే. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా, కాస్త పెద్ద స్థాయిలో ఉన్న కొందరు నేతలు టీడీపీ నుంచి వెళ్లిన వారే. తెలంగాణలో టీడీపీ ప్రాభవం కోల్పోవడంతో ఆ నేతలంతా బీఆర్‌ఎస్ వైపు టర్న్ అయ్యారు. సో, బీఆర్‌ఎస్ వైపు టర్న్ అయిన ఏపీ ఓటర్లందరూ.. ఆ పార్టీ ఏమనుకుంటోంది, ఎవరికి మద్దతిస్తోంది, ఏం చెప్పబోతోందన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని, బీఆర్‌ఎస్ అధిష్టానం మాత్రం న్యూట్రల్ వర్షన్ తప్ప అటో ఇటో చెప్పడం లేదు.
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్… ఏపీలో జరుగుతున్న దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఒక్కమాటతో తేల్చేశారు. మరో కీలక మంత్రి హరీష్‌రావు కూడా ఏపీ రాజకీయాలతో తమకేం సంబంధం అంటూ కామెంట్ చేశారు. అది రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవగానే చూస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక మౌనం అయితే పాటిస్తోంది. అలాగని బాబు అరెస్ట్‌ను పట్టించుకోవడం లేదని కాదు. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ అధిష్టానం మానిటర్ చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎవరికి ఎంత పర్సంటేజ్‌లో సానుభూతి, వ్యతిరేకత దక్కింది అని ఆరా తీస్తున్నారు. కొంతమంది ఏపీ లీడర్లకు ఫోన్ చేసి మరీ అక్కడి వాస్తవ పరిస్థితి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో ఏపీ ఓటర్లు చాలా కీలకం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని కనీసం 15 నియోజకవర్గాల్లో ఏపీ ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. చంద్రబాబు అరెస్ట్‌పై ఏ అభిప్రాయంతో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు.
బీఆర్‌ఎస్ అధిష్టానం వ్యూహాత్మక మౌనంతో ఉంటే.. బీజేపీ మాత్రం యమ దూకుడుగా వెళ్తోంది. చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ బండి సంజయ్ వైసీపీ ప్రభుత్వాన్నే తప్పుపడుతూ ఫైర్ అయ్యారు. ఆ ఒక్క అరెస్ట్‌తో ప్రజల్లో చంద్రబాబుకు మైలేజ్ పెరిగిందని చెప్పారు. బండి సంజయ్ స్థానం తక్కువేం కాదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. సో, బండి కామెంట్లకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా అధిష్టానం తరపున మాట్లాడినట్టే లెక్క. అటు ఎంపీ లక్ష్మణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ సపోర్ట్ చేశారు. ఎంపీ లక్ష్మణ్ కూడా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు. అందులోనూ ఆరోజు మాట్లాడింది ఢిల్లీ నుంచి.
బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఈ ఇష్యూపై రెండుసార్లు స్పందించారు. ఒకసారేమో.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని పురంధేశ్వరి చెప్పినట్టు చెప్పారు. లేటెస్ట్‌గా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదన్నారు. ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాల్సిందని కామెంట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ నేతలు స్పందించకుండా ఉండడం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఏపీ ఓటర్లు, టీడీపీ ఓటు బ్యాంక్ గురించి బీజేపీ నేతలకు కొన్ని లెక్కలు ఉన్నాయి. తెలంగాణలోని కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాలను ఏపీ ఓటర్లు ప్రభావితం చేయగలరని బీజేపీ అధిష్టానం దగ్గర కూడా సమాచారం ఉంది. పైగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఓ మాట అన్నారు. కేంద్ర బీజేపీ పెద్దల పాత్ర లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశామంటే నమ్మాలా అని క్వశ్చన్ చేశారు. దీనికి ఏపీ బీజేపీ నుంచి కౌంటర్ రాలేదు గానీ.. తెలంగాణ బీజేపీ మరో యాంగిల్‌లో సమాధానం ఇచ్చినట్టైంది. ఇది కేంద్రం డైరెక్షన్‌లో జరగలేదు అని చెప్పేలా తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. పైగా చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని మాట్లాడిన నేతలందరూ బీజేపీ జాతీయ కార్యవర్గంలోని నేతలే.
టీడీపీతో బీజేపీ పొత్తు కోరుకోవడం లేదు. ఈ విషయంపై అటు చంద్రబాబు చాలా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పారు. మొన్న ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంటే.. టీడీపీతో పొత్తు విషయం పక్కనపెట్టి.. ఆ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనుకుంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. బీఆర్‌ఎస్ సైలెంట్‌గా ఉండడంతో.. ఈ అవకాశాన్ని బీజేపీ చేజిక్కించుకోవాలనుకుంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో, కూకట్‌పల్లిలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నేషనల్ మీడియా కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఆలస్యంగానైనా జాతీయ స్థాయి నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాళిదళ్ అధ్యక్షుడు సుఖ్‌వీర్‌సింగ్ బాదల్, ఆర్జేడి ఎంపీ మనోజ్ చంద్రబాబుకు సపోర్ట్‌గా మాట్లాడారు. పైగా వీళ్లందరూ ఇండియా కూటమిలోని పార్టీల నేతలే. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఇష్యూను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ ఉందనేది విశ్లేషకుల అంచనా.
చంద్రబాబు అరెస్ట్ ఇష్యూ ఏపీకే పరిమితం అయ్యే అంశం కాదు. తెలంగాణలో ఉంటున్న ఏపీ ఓటర్లు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. దీన్ని తెలంగాణ బీజేపీ గమనించింది. పైగా ఇదే ఇష్యూపై బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. కాని, ఖమ్మం జిల్లాపై చంద్రబాబు అరెస్ట్ కచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి.. మొన్న తుమ్మల నాగేశ్వరరావు, నేడు మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. ప్రజా అవసరాల కోసం ముఖ్యమంత్రులు పాలనలో అనేక నిర్ణయాలు తీసుకుంటారని, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని అన్నారు.
ఓవైపు తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు స్పందిస్తుంటే.. ఏపీలో అందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ప్రొసీజర్‌పై పురంధేశ్వరి ఒక ట్వీట్ చేసి వదిలేశారు. విష్ణుకుమార్ రాజు కూడా స్పందించారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆది నారాయణ రెడ్డి లాంటి వాళ్లు మాట్లాడినా… సోమువీర్రాజు లాంటి వాళ్లు సైలెంట్‌గా ఉండడం వెనక కారణం ఏంటని విశ్లేషిస్తున్నారు. అంటే.. ఏపీ బీజేపీకి ఒకలా, తెలంగాణ బీజేపీకి మరోలా అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయనుకోవాలా? ఏదేమైనా.. చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ, బీఆర్‌ఎస్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంటే.. తెలంగాణ బీజేపీ మాత్రం ఓ స్ట్రాటజీతో చంద్రబాబును సపోర్ట్ చేస్తూ వెళ్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం