Chandrababu 4.0 Govt: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

ఎన్నికలు ముగిశాయి. విజేతల సంబరాలూ ముగిశాయి. కూటమి పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికవ్వటం. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం చకచకా జరిగిపోయాయి. సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను కూడా ప్రకటించడంతో వారంతా అదే రోజు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎవరెవరికి ఏ పోర్ట్‌ ఫోలియో అనే దానిపై ఒకటిరెండు రోజులు చర్చలు జరిగాయి. చంద్రబాబు 4.0 ప్రభుత్వం అందరి అంచనాలకు భిన్నంగా రూపుదిద్దుకుంది.

Chandrababu 4.0 Govt: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
CM Chandrababu - Gorantla Butchaiah Chaudary
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 19, 2024 | 7:34 PM

ఎన్నికలు ముగిశాయి. విజేతల సంబరాలూ ముగిశాయి. కూటమి పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికవ్వటం. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం చకచకా జరిగిపోయాయి. సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను కూడా ప్రకటించడంతో వారంతా అదే రోజు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎవరెవరికి ఏ పోర్ట్‌ ఫోలియో అనే దానిపై ఒకటిరెండు రోజులు చర్చలు జరిగాయి. చంద్రబాబు 4.0 ప్రభుత్వం అందరి అంచనాలకు భిన్నంగా రూపుదిద్దుకుంది. మంత్రివర్గ కూర్పులో భాగస్వామ్య పక్షాలతో పాటు యువ నేతలకూ ఈ దఫా చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. మంత్రిపదవి తప్పదు అని కొంత మంది సీనియర్ల విషయంలో వేసుకున్న అంచనాలు తప్పాయి. మొత్తానికి 25 మందిలో 17 మంది కొత్త వారికి చంద్రబాబు మంత్రిపదవులిచ్చారు. యువరక్తాన్ని ప్రోత్సహించారు.

సాధారణంగా పార్టీలో సీనియర్‌ సభ్యులకు మంత్రి పదవులు కట్టబెట్టటం చూస్తుంటాం.. కానీ చంద్రబాబు యువతకే పెద్దపీట వేయటంతో పార్టీ సీనియర్లలో అసంతృప్తి వస్తుందేమోనని సందేహించారు. ఇప్పటికైతే అలాంటి ఛాయలేవీ కనిపించలేదు. ప్రభుత్వ నిర్వహణలో ఎంతో కీలకమైన స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ లాంటి పదవులకు కచ్చితంగా సీనియర్ల అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఏపీలో ఈ రెండు పదవులు ఎవరిని వరిస్తాయనే చర్చ నడుస్తున్నది. మంత్రివర్గాన్ని యువరక్తంతో నింపినట్టు ఈ రెండు పదవులను నింపటం కుదరదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. పనిలో పనిగా ఫలానా వారికి స్పీకర్‌, ఫలానా వారికి డిప్యూటీ స్పీకర్‌ అంటూ ఊహాగానాలకు తెరలేపారు.

ఓ వైపు ఈ చర్చ జరుగుతుండగానే సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించటానికి ప్రొటెం స్పీకర్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరును పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేసినట్టు బుచ్చయ్య చౌదరి తెలిపారు. గవర్నర్‌ బుచ్చయ్య చౌదరి చేత గురువారం ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. బుచ్చయ్య చౌదరి ఏడో సారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తన సీనియార్టీని దృష్టిలో పెట్టుకునే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారని బుచ్చయ్య తెలిపారు.

21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అదే రోజు సభ్యుల చేత ప్రమాణం

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అదే రోజు ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి సభకు ఎన్నికైన వారి చేత ప్రమాణం చేయిస్తారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత శాసనసభ మొదటి సమావేశానికి స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల పదవి ఖాళీగా ఉంటుంది. అందుకనే సభకు అధ్యక్షత వహించేందుకు ముఖ్యమంత్రి సూచించిన వ్యక్తిని గవర్నర్‌ తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తారు. ఇలా నియమితుడైన ప్రొటెం స్పీకర్‌ మిగతా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సాధారణంగా ఈ పదవికి సభ్యులందరిలో సీనియర్‌ను ఎంచుకునే సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది. ఈ నెల 22న స్పీకర్‌ను ఎన్నుకోవడంతో ప్రొటెం స్పీకర్‌ బాధ్యత పూర్తి అయ్యి ఆ పదవి రద్దయిపోతుంది.

స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులపై సస్పెన్స్‌

ఏపీ స్పీకర్‌ ఎవరు? డిప్యూటీ స్పీకర్‌ ఎవరు? అనే దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూ ఉన్నది. ఎవరికి తోచిన పేర్లు వారు పేర్కొంటున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ల పేర్లతో జాబితా రూపొందించారు. ఇంకొందరు మరికాస్త ముందడుగు వేసి స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పేర్లు ఖరారయ్యాయంటూ పుకార్లకు తెరలేపారు. వాస్తవానికి చంద్రబాబు మదిలో ఎవరి పేరు ఉందో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. టీడీపీలోని సీనియర్‌ సభ్యులను ఈ పదవులు వరిస్తాయా? జనసేన తరుఫున ఎవరికి ఛాన్స్‌ దక్కొచ్చు? అని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

ఈ ఊహాగానాలన్నింటికీ ఈ నెల 22న తెరపడునున్నది. కొత్త అసెంబ్లీలో స్పీకర్‌ సీట్లో ఎవరు కూర్చుంటారన్న దానిపై ఇప్పటికే స్పష్టత వచ్చే ఉంటుంది. కాకపోతే చివరి నిమిషం వరకు పేరు వెల్లడించకపోవడంతో రాజకీయ వర్గాల్లో సస్పెన్స్‌ కొనసాగుతున్నది. దీంతో పాటు ప్రభుత్వ నిర్వహణలో అత్యంత కీలకమైన చీఫ్‌ విప్‌, విప్‌లు ఎవరనే దానిపై కూడా జోరుగా చర్చ నడుస్తున్నది. ముందుగా స్పీకర్‌ సస్పెన్స్‌ తొలిగిపోతేనే విప్‌ లపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..