Vishaka railway zone: విశాఖ రైల్వే జోన్‌పై వస్తున్న వార్తలను ఖండించిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే..
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదన్నవి కేవలం పుకార్లేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తేల్చి చెప్పారు...
Vishaka railway zone: విశాఖ రైల్వే జోన్ విషయంలో జరుగుతోన్న ప్రచారాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తెలిపినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. అలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదన్నవి కేవలం పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఏపీ, తెలంగాణ విభజన హామీలు, సమస్యల అంశాలపై తాజాగా కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అసాధ్యమని కేంద్రం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు మంత్రి అధికారికంగా స్పందించారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణ పూర్తి అయిందని తెలిపారు. ఇక ఇదే విషయమై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రి త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. రైల్వే జోన్‌కి సంబంధించిన వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. రైల్వే జోన్ విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, జోన్ ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపిందని నరసింహారావు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదన్న వార్తలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. రైల్వే జోన్ విషయంలో జరుగుతోంది అంతా తప్పుడు ప్రచారమని చెప్పారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసలు సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదని క్లారిటీ ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ కచ్చితంగా వచ్చితీరుంతని, లేదంటే తాను రాజీనామా చేస్తానని విజయ్‌సాయి రెడ్డి ఉద్ఘాటించారు.